పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

345

చ. "పెనుగదఁ బూని మొత్తములు పిప్పియొనర్చుట తప్ప నెన్నడుం
     బనిఁగొని యిట్టివ్యూహములు పన్నుట విప్పుట నే నెఱుంగ నీ
     వనిమొన వాఁడిసూఁదిమొన యంత గదల్చితివేని చొచ్చి య
     మ్మొన గలగుండు వెట్టి పడమొత్తెద మత్తగజంబుచాడ్పునన్."

చ. “ఒరులకుఁ జేతఁకాదు, చనె నొండెడ కర్జునుఁ డంచుఁ జిత్తమం
     దరసి గురుండు పన్నిన మహాకపటం బిగి మొగ్గరమ్ములోఁ
     జొరుటకు దారిచూపి మము శూరులఁ జేయఁగదయ్య నేటిసం
     గరమునఁ గుంతిభోజుసుత కంటెను గోడలు వీరమాతగన్."

యెన్నని వుదాహరించేది? ఈలాటి బంగారమంతా నాకింద జమకట్టి యేవో నాతాలూకు పాషాణాలు “శాంతింపుడని రాయబారమౌరా" అనేవి అతనికి అంటఁగట్టి గౌరవాన్ని సంపాదించడానికి యత్నించేవారు నిజమైన విమర్శకులు గారు. సమాసభూయిష్ఠమైన రచన అతనిది బోలెఁడు వుంది. దాన్ని లోకాభిరామాయణంలో “ఱంతుల్ మానఁడు తిర్పతిద్విజుఁడు" అనే పదంతో వుంటుంది చూచుకోండి. అందులో యేకొంచెమో నాదిగాని చాలాభాగం అతనిదే. అదీ రచిస్తాఁడు, యిదీ రచిస్తాఁడు. ఆయాఘట్టాలకు అనుగుణంగా ఆయాధార నడుస్తుంది కాని అతనికి యెక్కువప్రీతి తెలుఁగు పదాలతో రచించడమందే. దానికి కొన్ని పద్యాలు చూపివున్నాను; యింకోటికూడా చూపి తరవాయి అందుకుంటాను.

చ. "బ్రతికిన నాల్గునాళ్లు ఋతవాది యుధిష్ఠిరుఁ డన్న మేటికీ
     రితి గలవాఁడనై ధరఁ జరించి తుది న్నృపకోటి మెచ్చ దు
     ర్గతి గనకుండ స్వర్గమునఁ గాఁపురముండఁదలంచునాకు నీ
     యతు కొనరించెదే కటకటా యదునందను పేరుమీఁదుగన్'

పుక్కిటిపురాణాలు అనాదిగా కవులను గుఱించేకాదు, అన్యులను గుణించిన్నీ వుంటాయి. వాట్లకు తలా తోఁకా అంటూ వుండదు. సరియైన హేతుహేతుమద్భావమున్నూ వుండదు. అవి యొన్నటికీ అంతరించవు.

అయితే యీ వ్రాయడం యెందుకంటే? ఆ యేకలవ్యశిష్యుణ్ణి అనాదరించ లేకేకాని యింకెందుకూ కాదు. యెంతో యెవరితోనో యీ విషయం రాఁబట్టే ఆయన వున్నదున్నట్టు వ్రాయుమని కోరివుంటాఁడు కాని వూరికే నా కీ పరిశ్రమని వార్ధక్యంలో కల్పించేవాఁడు కాఁడనియ్యేవే. .