పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/338

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

342

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మా యిద్దఱికీ యీ విషయంలో చాలా ప్రభేదం. దీన్ని పలువురు యెఱిఁగే వుంటారు. అతఁడు నిరామయుఁడు గానే యావజ్జీవితమున్నూ గడిపినట్లువ్రాసి వున్నాను. కాని, ఆతనికి తలనొప్పివకటిన్నీ వికారం ఒకటిన్నీ ఆశ్రయించుకు వుండేవి. అవి వొంటెద్దు బండిగాని, గుర్రపుజట్కాగాని యెక్కినప్పుడు తప్ప కనబడేవి కావు. యీ రెండిట్లో యేది యెక్కియేమాత్రం ప్రయాణంచేయవలసి వచ్చినా దిగేపర్యంతమూ అవి తోలేవాళ్లతో పోట్లాట తప్పేది కాదు. ఇంతకు తప్ప అతఁడు వ్రాసినట్టు యే జబ్బున్నూ అతఁడెఱఁగనే యెఱఁగఁడు. అతనిపేరు చెపితే జబ్బులు జంకుతాయనేవాఁడు. ఆమాట నిజమే. చిడుమూ, మొలగజ్జీమాత్రం విద్యార్థిదశలో అతణ్ణి సర్వదా ఆశ్రయించి వుండేవికాని, వీట్లనుగురించి లేశమున్నూ అతఁడు శ్రద్ధపుచ్చుకునేవాఁడే కాఁడు. శాస్త్రుల్లుగారే యెప్పుడేనా "యేమిటయ్యా! యేదో మందు రాసుకోరాదా?” అని కూకలేసేవారు. ఆత్మకూరి చలిజ్వరంమాత్రం తప్పించుకోవడానికి వీలులేనిది కనక, అందఱితోపాటు అతఁడుకూడా అనుభవించాఁడు! ఇంతకు తప్ప యే వ్యాధిన్నీ యెఱఁగని జీవితమంటే అతనిదే. యేదో మాదిరి వంట అతనికి నచ్చేదికాదు. తగినంత పాకనైపుణ్యం వున్నవాళ్ల పాకంగాని కవిత్వంలాగే ఆతనికి సొక్కేదికాదు. అయితే పని పడితే "నలపాక భీమపాకా" లన్నట్టు ఆతఁడు తయారుచేసే నేర్పుకలవాఁడు. ఎక్కడేనా వండుకోవలసిన కర్మం తటస్థిస్తే నేను పైవనిన్నీ, అతఁడు ప్రధానకార్యమున్నూ నెఱవేర్చేవాళ్లం. యెప్పుడోగాని మా ప్రయాణాలలో యీఅవస్థ తటస్థించేదే కాదు. అతనికి లేని ప్రజ్ఞలలో అంతో యింతో కూనిరాగం తీయడం నాకున్నూ నాకు లేని ప్రజ్ఞలలో పాకశాసనత్వం అతనికిన్నీ వుండేవని చదువరులు గమనించాలి. అయితే అతనికి యిటీవల సంగీత విషయంలో రాగాలు గుణితించేశక్తి కొంత వుండేది. రేఁగుప్తిమీఁదా, శుద్ధసావేరిమీఁదా పద్యం చదివేశక్తిన్నీ వుండేది. కల్యాణి, కేదారగౌళ వగయిరా రాగాలమీఁద కూడా పద్యాల్ని చదివేవాఁడు. ధాటీగా పద్యం చదివేవాఁడుకాని, యేమైనా వంశపరంపరగా వేదం వచ్చిన కుటుంబ మవడంచేతనో యేమో, గానవిషయం యేకొంచెమో పద్యం చదవడానికి మించి అలవడిందికాదు. కవిత్వం యేలాటి సహజవిద్యగా చెపుతారో గానంకూడా ఆలాటిదే. కాని, 18 సంవత్సరాలదాఁకా కవిత్వమంటే యొఱఁగని అతనికి వొకటేమాటుగా “కుండజల” లాగ ఆ మహాధార బయలుదేరింది. దాన్ని గూర్చి కాళీసహస్రంలో వకశ్లోకంలో అతఁడే వివరించివున్నాఁడు.

శ్లో. “సాహిత్యాం గురుపాణినీయజనితా పౌరాణ సంవర్ధితా,
     దేశాలోకన పుష్పితాచ కవితా కన్యా మయి ప్రత్యయాత్,
     వవ్రే మాం స్వయమేవ."