పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

334

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చాకచక్యాన్ని గూర్చి వారెచెప్పఁగా విన్నానుకూడాను. తరవాత గంకలకుఱ్ఱు వగయిరా గ్రామాలల్లో తరవాయి కావ్యాలున్నూ తగుమాత్రం నాటకాలూ భాణాలూ చదవడం జరిగాక కొంచెం తర్కంలో ప్రవేశించి వేలెట్టి యేకొంచెమో చదివి శ్రీ బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారు కాశీనుంచి దేశానికి వచ్చి విద్యార్థిపోషణార్థమై జల్లిసీమకు ప్రయాణమై రావడంలో వీరివూరు యండగండి వెళ్లడంలో వీరింటివద్దనే శాస్త్రుల్లుగారు మకాం చేశారు. ఆ గ్రామానికి యెంత మంది అతిథులు వచ్చినా వీరియింటనే అన్నప్రదానం జరిగేది. ఆ సందర్భాన్ని పట్టే మన తిరపతి శాస్త్రి "అన్న మెన్నం డేరికైన లేదనని యుత్తమురాలు తల్లి శేషమ సుసాధ్వి" అని వ్రాసి వున్నాఁడు. ఆ యిల్లాలిని నేనున్నూ బాగా యెఱుఁగుదును. మాయిద్దఱికి అనుబంధం యేర్పడ్డ తర్వాతకూడా ఆమె చాలా కాలం జీవించే వుంది. తండ్రిగారుకూడా డిటో, వారిద్దఱూకూడా నన్నుకొడుకు తిరపతిశాస్త్రికన్నాయినుమిక్కిలిగా ప్రేమించేవారు. తిరపతి శాస్త్రి సోదరులు మఱినలుగు రుండేవారు. వారుకూడా నన్ను ఒక సోదరుఁడుగానే భావించేవారు. మేనమామ లోనయిన బంధువులందఱూ వాడికంటేకూడా నన్నే మిక్కిలిగా ప్రేమించేవారు. మే మిద్దఱమూ యేదేనా విద్యావిషయంలో వాదం పెట్టుకున్నప్పుడు తి. శా, గారి తండ్రి వేంకటావధాన్లు గారు తీర్చవలసివస్తే నిష్పక్షపాతంగానే తీర్చేవారు కాని కొడుకని లేశమున్నూ పక్షపాతం చూపేవారు కారు. ఆ కాలానికీ సర్వత్రా వ్యాపకంలో వుండే శాఖాపక్షపాతంకూడా ఛాందసులైనా వారి దగ్గిఱ లేశమున్నూ నా విషయంలో వుండేది కాదు. దానికి తార్కాణం వారి తండ్రిగారి ఆబ్దికానికి వెల్నాటిశాఖీయులు పలువురు వున్నా నన్నే భోక్తగా నియంత్రణ చేసేవారు. “వొరే! నీవు కాళిదాసువురా" అని నన్ను శ్లాఘిస్తూ వెనక వ్యాసులూ, కాళిదాసూ యెక్కడో బ్రాహ్మణార్థం చేసినకథ వుపన్యసిస్తూ వుండేవారు. దీన్ని యిలా వుంచుదాం.

మన కథానాయకుఁడు బ్రహ్మయ్యశాస్త్రుల్లుగారి శుశ్రూషకు ప్రవేశించడం యేలా తటస్థించిందో అంతవఱకు ప్రస్తుతాంశం వ్రాసినట్లయింది. అతఁడు ప్రవేశించిన నాల్గు లేక అయిదు మాసాలకు నేను కంటిజబ్బు కొంత కుదుర్చుకొని శాస్త్రులవారి శుశ్రూషకు ప్రవేశించాను. అప్పటికి సిద్ధాంతకౌముది శబ్దాధికారం పూర్తిఅయింది తిరుపతిశాస్త్రికి. నాకు చామర్లకోట గురువులవద్ద లఘుకౌముదిలో అంతవఱకున్నూ అయిందికాని సహాధ్యాయిత్వం కుదరడం యేలాగ? విషయం ఒకటే అయినా సిద్ధాన్తకౌముది చదివినవాఁడితో లఘకౌముది చదివినవాఁడు సరీసమానంగానే కాదు, యేతాం పెట్టుగా కూడా తూఁగఁడు. ఆ కౌముది చదవడానికీ యీకౌముది చదవడానికీ భేదం వంటిపూఁటి తిండికీ ఆబ్దికపు బ్రాహ్మణార్థానికీ వున్నంత తేడా వుంటుంది. అందుచేత మఱికొన్నాళ్లదాఁకా మే మిద్దఱమున్నూ సతీర్థ్యులమే కాని సహాధ్యాయులం కావడం జరగలేదు. నాకు