పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

330

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అంతకు మున్ను వక నెల్లాళ్లనాడు మా మేనత్తకూతురు వివాహానికి కాటవరం గ్రామం వెళ్లినప్పుడు ఆ గ్రామవాస్తవ్యులు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులుగారు సుమారు నాకన్న రెండుమూడేండ్లు పెద్దవారు నిర్వ్యాజమైన ప్రేమతో, అబ్బాయీ, నీవీవూరువస్తే నీకు చదువు చెపుతానని చెప్పివుండడంచేత, కాకినాడనుంచి కాటవరానికి మకాం యెత్తేశాను. మేనత్తగారి వూరవడంచేతనేమి, గురువుగారి ప్రేమాతిశయంచేతనేమి ఆవూరునాకు పొరుగూరనిపించనేలేదు. కాటవరం వెళ్లేటప్పటికి నాకు కుమారసంభవంలో మొదటిసర్గలో యేనాలుగైదు శ్లోకాలో పిల్లంక అనంతాచార్యులవారివద్ద అయినాయి. తెలుగులో స్కూల్లో చదివినది తప్ప ఇతరమేమీ రాదుగాని, జావళీలూ, భజనకీర్తనలూ, కొన్ని తరంగాలూ, కొంచెం . అధ్యాత్మకీర్తనలూ, మువ్వగోపాలపదాలూ ఈ సరుకుమాత్రం కొంత విస్తరించివుండేది. ఏదో కొంచెం పదకవిత్వంకూడా కంగాబంగాగా అల్లేవాణ్ణి. ఏదో చిన్నతనంచేత చెపితే అందులో తమకు సంబంధించిన దూషణ వుందని రఘువంశం చదివేరోజుల్లోనే నామీద వకరు కేసుకూడా పెట్టేరు. విచారణకర్త, ఫ్రెంచిదొర “వీడు పోయట్ అంటే నేను వప్పుకోను,” అని కేసుకొట్టేశాడు. కృష్ణమూర్తిశాస్త్రులుగారివద్ద కుమారసంభవంలో వకటి, మూడు, అయిదు సర్గలు చాలవఱకున్నూ, మేఘసందేశంలో పూర్వభాగంలో కొంతవఱకున్నూ చదవడమే కాకుండా, వారున్నూ వారి సహాధ్యాయులు మధిర సుబ్బన్నదీక్షితులు గారున్నూ లక్షణవిషయాలు చర్చించుకొనేటప్పుడు వినడంవల్ల కొంచెం లక్షణజ్ఞానంకూడా సంపాదించుకొన్నట్టయింది. పైగా చదరంగం నడకలేకాకుండా కొంత వఱకా ఆటలోకూడా ప్రవేశం వారే కలిగించారు. అంతతో ఆవూరు చదువుకు విఘ్నంవచ్చింది.

ఆపైని కాజులూరు విద్యార్ధిత్వం. ఆ వూళ్లో మేఘసందేశ పూర్వభాగంలో తరవాయి మాత్రం జరిగింది. చదరంగంలో కొంత పాండిత్యం అతిశయించింది. సులక్షణసారం స్వయంగానే చూచుకొని కవిత్వం పద్యాల్లో చెప్పడంకూడా ఆవూళ్లోనే మొదలు పెట్టాను. ఆ వూళ్లో గురువులు ముగ్గురు : రేగిళ్ల కామశాస్త్రులుగారు, పప్పు సోమయ్యగారు, పప్పు సోమనాథశాస్త్రులుగారు. వీరెవరున్నూ కవులుగారు. మొదటి గురువు భుజంగరావు పంతులుగారు గ్రంథాలేమీ వ్రాయలేదు గాని, వారు మాత్రం కవులే. తరువాత కాటవరంలో శుశ్రూషింపబడ్డ గురువులున్నూ కవులే. వారివారివద్ద నేను కవిత్వానికి సంబంధించిన కృషి చేయలేదు. ఏదో తోచినట్టు అల్లడానికి మొదలు పెట్టేనన్నదే ముఖ్యాంశం. అందుచేత లక్షణంలో యెన్నో సంశయాలు కలుగుతూవుండేవి. యెవరేనా తటస్థించినప్పుడు కనుక్కుంటూ వుండేవాణ్ణి. కాజూలూరులో ఒక విశేషం. వారాలు యెంతో గౌరవంగా యిచ్చేవారు. వున్నచోటికి వచ్చి పిల్చేవారు కూడాను.