పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా గురుపరంపర

329


గురుత్వం చేసిన అవధాన్లుగారు ఆ గ్రామం పైమీద బట్టతో మాత్రం వచ్చినవారైనా ఆ వూళ్లో వుండే సంపన్నులలో వకరై యిప్పుడు పుత్రపౌత్రసంపత్తుతో తులదూగుచూ యజ్ఞయాగాదులు చేసిన కర్మిష్ఠులై చయనం చేసేకుతూహలంతో వున్నారు. రమారమీ యెనభై యేండ్ల వయస్సులో నలభై యేండ్ల వయస్సులో వున్నట్లుంటారు. వీరి పేరుగల వీరి మనుమడికే నేను చి|| సౌ|| మా రెండోపిల్ల నిచ్చివివాహం చేశాను. ఆ కుఱ్ఱవాడే ఆ మధ్యను షష్టిపూర్తి సభలో ఘనపనస చెప్పినవాడు. ఇప్పుడు పదకొండేండ్ల వయస్సులో నున్నాడు. ఆ అవధాన్లగారే కాదు, ఈయన పెద్దకొడుక్కూడా యజ్ఞం చేశాడు. నేనైతే కర్మిష్ఠిని కానుగాని, కర్మిష్ఠులను చూస్తే నాకు చాలా సంతోషం. అందుచేత ఇక్కడ కొన్నిపంక్తు లెక్కువగా వ్రాశాను. పశుహింసలేకుండా ఈ కర్మిష్ఠులు యజ్ఞాదికర్మలు జరిగిస్తే మఱీ సంతోషిస్తాను. కాని నా మాట వారు వినరు. ఏమన్నా అంటే, “వచనాత్ర్పవృత్తి వచానాన్నివృత్తి" అని చదువుతారు. దేవీభాగవతంలో ఋషులు పశుహింసలేని యజ్ఞాలే - చేశామని చెప్పుకొన్నారు. వారికి పైవాక్యాలు తెలుసునో లేదో!

ప్రకృతానికి వద్దాం. ఇతరవిద్యలప్రధానంగా, కావ్యాలు ప్రధానంగా, యేలాగైతేనేమి రెండేండ్లలో మూడుసర్గలు రఘువంశం చదవడం అయింది. కాని వల్లించుకోవడానికి మాత్రం అవకాశం వుండేదికాదు. ఆ వూరినుంచి వచ్చేటప్పుడు తోవలో గురువుగారు చెప్పిన పాఠం చదువుకోవలసిందేకాని, ఇంటికి వచ్చాక తీరుబడి వుండేదికాదు. త్రోవలోకి యెదురుగుండా స్నేహితులు వచ్చేవారు. ఇక చదువెక్కడ? ఆటలే ఆటలు, మేమే మేము. రఘువంశపు చదువిలా దాటింది. అంతలో యానాం గ్రామంలో నేమి, నీలపల్లె, తాళ్లరేవు, కోరంగి మొదలైన ఆ ఉప్పుటేటి ప్రాంతం గ్రామాల్లోనేమి, సర్వసాధారణంగా వుండే బోదకాలు వగైరా వ్యాధులలో వకటయిన “వరిబీజం” అనే వ్యాధి నా భవిష్యదభివృద్ధికి సూచకమై అంకురించింది. ఏవో కొన్ని వైద్యాలు చేసినప్పటికీ గుణం కనపడిందికాదు, గ్రామంవదిలేస్తే తప్పక కుదురుతుందని తోచి యానాముకు సుమారు నాలుగైదు మైళ్లలోవున్న పిల్లంక చదువుకోవడానికి మకాంగా ఏర్పఱచుకొన్నాను. కాని, నదీపాత మయిన కారణంచేత ఆ గ్రామం పునస్సృష్టమైన కారణంచేత ఇళ్లు దూరదూరంగా పొలాల్లో వుండేవి. చిన్నతనం గనక రాత్రి ఆయాచోట్లకు వారాలకి వెళ్లలేక ఆ వూరుకూడా వదులుకోవలసి వచ్చింది.

తరువాత అల్లంరాజు సుబ్రహ్మణ్యకవిగారితో చదువుకోవడానికి మా వూరునుంచి యింట్లో చెప్పకుండా చేబ్రోలుకు బయలుదేరి వెళ్లేనుగాని, త్రోవలో కాకినాడలో చదువుకొమ్మని చెప్పి ఆయన ఆ వూళ్లో దిగబెట్టి వెళ్లిపోయారు. ఆ వూళ్లో కల్లూరి గణపతి శాస్త్రులవారు పాఠం చెపుతామన్నారుగాని, వారాలు కుదరటం తటస్థించిందికాదు. అప్పుడు