పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఆరోజుల్లోనే ముక్కవిల్లి జగ్గన్నదీక్షితులుగారివద్ద సంధ్యావందనపు తప్పులూ, అపస్వరాలూ దిద్దించుకొన్నాను. వీరిది గోదావరితీరం కోరుమిల్లి కాపురం. మన్యంవారి సంస్థానంలో జపతపాలకై అప్పుడప్పుడు వస్తూవుండేవారు. మన్యంవారి పురోహితులు గాడేపల్లి సుబ్బావధాన్లుగారు కాపులపాలెంలోనే వుండేవారు. కాబట్టి, వీరు వారింటిలో మకాంగా వుండేవారు. ఆ కారణంచేత ఆ వూరు వెళ్లినప్పుడు వీరి శుశ్రూష నాకు లభించేది. గాడేపల్లి సుబ్బావధాన్లుగారి కుమాళ్లు వెంకటరామయ్యగారి వద్దనూ, మర్ల జోగయ్యగారి వద్దనూ అద్దరి మురుమళ్ల కొత్తపల్లి కాపురస్తులు వుప్పులూరి రామజోగన్న సిద్ధాంతిగారి వద్దనున్నూ యేవకటి రెండు శ్లోకాలో చదివికొన్నట్టు జ్ఞాపకంగాని, యేమైననూ రఘువంశ గురుత్వం సర్వమున్నూ కానుకుర్తి భుజంగరావు పంతులవారి ప్రసాదమే. చిన్నప్పుడు పడుగులో సంధ్యావందనం చెప్పుకున్నప్పటికీ ప్రతీపూటా సరిగా వార్చకపోవడంచేత మరచిన చోట్లున్నూ స్వరదోషాలున్నూ చాలాభాగం జగ్గన్నదీక్షితులవారి శుశ్రూష ఫోగొట్టింది. శేషమేమేనా వుంటే అది యిటీవల ప్రధాన గురువు బ్రహ్మయ్య శాస్త్రులవారి పాఠశాలలో శ్రీ గోరుగంతు శ్రీరామావధాన్లుగారివద్ద వేదంచెప్పుకునేటప్పుడు పోయివుండాలి. ఇంకా మిగిలితే ఇవి యిప్పటికిన్నీ మిగులే. ఈ సంధ్యావందనం విషయం నాబోట్లలెక్కేమి? పెద్ద పెద్ద వేదపండితులలో కూడా నూటికి తొంబది మందికీ చిక్కున్నదే. కారణం నోరు నలగనప్పుడు చెప్పకోవడమే. వేదంలో యేపన్నాలో కొన్నాళ్లు సంత చెప్పుకుంటేనే గాని నోరు నలగదు.

ఈ రఘువంశం చదివేరోజుల్లోనే యింజరంలో రామడుగుల వేంకట సుబ్బరాయావధాన్లుగారి శిష్యులలోచేరి జంద్యాలవడుకుతోపాటు కొన్ని పరాయాతప్పన్నాలు సంతచెప్పుకొన్నాను. కాని జంద్యాల వడుకు మాత్రం నేర్చుకొన్నట్టయింది. కొంచెం నోరున్నూ నలిగింది. కాని ఆ పన్నాలు పూర్తికాలేదు. ఆ జంద్యాల వడుకునుగూర్చి కొంత వ్రాస్తాను. గురువుగారు సంతచెపుతూ పత్తివిడదీసి పింజెలుచేసి శిష్యులకి యిస్తూ వుంటారు. శిష్యులు చేతితోవడుకుతూ నోటితో సంత చెప్పుకుంటూ వుంటారు. అధమం వొక్కొక్క శిష్యుడు రోజు వక్కంటికి అర్ధణానూలేనా వడుకుతాడు. నెల వక్కంటికి రూపాయిజీతం యిచ్చినట్లవుతుంది. ఈలాంటి శిష్యులూ, ఆలాంటి గురువులూ మా విద్యార్థి దశనాటికింకా వుండేవారు. యిప్పుడున్నట్టు తోచదు. చదువంటే యెంతో తేలికగా అప్పుడు వుండేది. యిప్పుడు వేలకొలది కొన్నిటికీ, లక్షలకొలది కొన్నిటికీ పెట్టుబడిపెట్టి పాఠశాలలు స్థాపిస్తూ వుంటారు. విద్య అంతకన్నబాగా జరుగుతూన్నట్టు కనపడదు. దానికీ దీనికీ యెంతభేదం ఉందో చూడండి. అన్నిటిమాటా అలా వుంచుదాం. ఈ జంద్యాల వడుకు పాఠశాలలు మన గాంధీగారు చూస్తే వుబ్బితబ్బిబ్బైపోతారు. ఈ రీతిని మాకు