పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా ముత్తాత

321


కాకుండా దానికి తగ్గ పాండిత్యం కూడా అతనికి వుండేది. దేవీభాగవతంలో దశమస్కంధం అతడే తెలిగించాడు. అతడెక్కుడు పేరు ప్రతిష్ఠలు సంపాదించేవాడే కాని, అల్పాయుష్కుడై యిప్పటికి యిరువైయేండ్లనాడు ముప్ఫైయేండ్ల వయస్సులో స్వర్గస్థుడైనాడు. మంచిగాని, చెడ్డగాని వంశమం దున్నట్టయితే అది అనుశ్రుతంగా వస్తుందన్నందుకు నేను వ్రాసిన సంగతులు కొంత దృష్టాంతం కావచ్చును. తిరుపతిశాస్త్రిగారి తరంలోతప్ప వారి వంశమందీ కవిత్వం వున్నట్టులేదు. మళ్లా తిరుపతి శాస్త్రి కొడుకు పెద్దవాడు కవి. పోనీ తండ్రి కవిగనుక అతనికది సంక్రమించిందనుకుంటే, అతని అన్నకొడుక్కూడా కవి. దీన్నిబట్టి వంశంలో వుండనే అకర్లేదనిన్నీ తోస్తుంది. కొడుకులే అక్కఱలేదు. కవుల కూతుళ్లుకూడా కవిత్వం చెప్పడం కలదు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులవారి కొమార్తె యిందు కుదాహరణం. వాళ్లు అయినా కాకపోయినా, తండ్రికి మాత్రం తనవిద్య తన సంతానానికి రావాలి అనే కోరిక వుంటుంది. దాన్నిబట్టిసాధ్యమైనంతవఱకు దాన్నే అభ్యసింప చేయాలని ప్రయత్నం తండ్రిచేస్తాడు. ఇప్పటికాలంలో మాత్రం లాభాపేక్షచే చాలా మంది తండ్రులు ఈ వుద్యమాన్ని వదలుకొన్నారు. ఇంకా నాబోటి చాదస్తులు ఈ వుద్యమంలోనే వున్నారు.

నిన్నమొన్నటినుంచి నావంటి చాదస్తులనికూడా అభినందించేవారు రాజకీయ విద్యాభాస్యం చేసినవారిలో కనపడుతూన్నారు గాని, యింతకు ముందు మాత్రం అట్టివారు బొత్తిగా లేరు అని వ్రాసేవున్నాను. కాని ఆలాటి రోజులలోనే నేను ఫ్రెంచి చదువుకుంటూ వుంటే, బెజవాడ బాపనయ్య నాయడుగారనే ఆయన మా తండ్రిగారిని పిలిచి “మీపూర్వులు కవీశ్వరులు, మీ అబ్బాయి కిదెందుకు? కులవిద్య చెప్పించండి, (కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా)” అని ప్రోత్సాహపరచి శ్రీకానుకుర్తి భుజంగరావుపంతులువారివద్ద నన్ను వప్పగించారు. ఈ బాపనయ్య నాయడుగారు నామమాత్ర శూద్రులు. తేజస్సుచేతనేమి, తెల్వితేటలచేతనేమి, ఈయన కెంతటిమహారాజులున్నూ సాటికారు. ఈయన యానాం కాపురస్థులు. ఫ్రెంచిరాజ్యంలో ఈయన వుద్యోగధర్మంచేత ఏకచ్ఛత్రాధిపత్యం చేశారు. మిక్కిలి భగవద్భక్తులు. నేను భీష్ముణ్ణి చూడలేదుగాని, ఈయన విగ్రహం తలపులో పొడకట్టినప్పుడు భీష్ముడే యీలా అవతరించినట్లభిప్రాయపడతాను. నాకు కులవిద్య రావడానికి మా ముత్తాతగారి ప్రతిష్ఠతో పాటు ఈ నాయడుగారుకూడా కారణం గనుక కొంచెం కృతజ్ఞతను తెల్పడానికి కొన్ని పంక్తులు ఈయన్ని గుఱించి యిక్కడ వ్రాశాను. మా పిల్లల్లో కూడా ఈ కవిత్వం అంతో యింతో వ్యాపించేటట్టు తోస్తుంది. దీనికంతకూ కారణం మా ముత్తాతగారే కనుక, ఆయనకు మాటి మాటికీ నమస్కరిస్తున్నాను. తరవాత పండితులవుతారో, కారో అది భగవదిచ్చగాని మోటుగా వుండే "శాస్త్రి" పేరే వుంచాను. భగవంతుడు వాళ్లను సర్వదా ఫలానా వంశస్టులనునట్లు అనుగ్రహించుగాక!

★ ★ ★