పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

318

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ప్రకృతానికి వద్దాం. ఇంతవఱకు నాపిల్లల్ని స్కూలుకెవళ్లనీ పంపనేలేదు. అక్షరాభ్యాసంతోటే రామశబ్దం మొదలుపెడుతూవున్నాను. రామశబ్దానికి కాకున్నా అక్షరాలకేనా స్కూలు పనికిరాదా? బాగా ఆలోచిస్తే పనికిరాదు. పనికిరానేరాదు. ముమ్మాటికీ పనికిరాదు. కారణాలు వ్రాయమనకండి, నా మనవి చిత్తగించి మీరే అనుభవంలోకి తెచ్చుకోండి, “ఈమీప్రతిజ్ఞ యికముందు సాగుతుందా?” అంటారా? ఆలా అడగండి. రూల్సువస్తే, టీకాలతోపాటు దీనికిన్నీ తలవగ్గుతాను. శారదాబిల్లు రజస్వలావివాహానికి సిద్ధంచేయడంలేదూ? ఆలాగే ఇదీ అనుకోండి, తప్పో వొప్పో నాకున్న అభిప్రాయం వ్రాశాను. మా ముత్తాతగారి ముచ్చటలో ఈసోదెందుకు? ఎందుకా? ఆయన ఆత్మ సంతోషించడానికి

ఇక ఆయన పద్యాలు స్వల్పంగా వుదాహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను :-

ఉ. డాలు కడానిమేను, మరుడాలునెదుర్కొనుఁజూపు, చంద్రఖం
    డాలు నఖంబు, లేర్పుపగడాలు రదచ్ఛదకాంతు, లేన్గుతొం
    డాలు తొడల్, మదాళిజగడాలుకురుల్, నునుదమ్మికెంపుతం
    డాలు రదాళి, బర్నెబిరడాలు కుచాగ్రము లవ్వధూటికిన్.

పద్యము యామినీపూర్ణతిలకలోనిదే. యెంతమృదువుగానున్నదో చూడండి. ఈయనధార యెంతో మృదువైనది. కాని సహజమైన ధారను వదలికొని యితరుల ననుకరించడానికి మొదలుపెట్టేటప్పుడు మాత్రము యీ సొగసు పోగొట్టుకొంటాడు.

ఈయన, లోగడ నుదాహరించిన యక్షగానరచనవల్లనే సంగీత ప్రవిష్టుడని తేలుతుంది. అయినా దాని కుపోద్బలకంగా యింకొకపద్యం వుదాహరిస్తాను. దీనివల్ల యీయనకు గానమున నెంతయభిమానమో తెలుసుకోవడానికి వీలవుతుంది.

ఆ.వె. సరసులకును మోహసంపద లొదవించెఁ
       బూలుపూచెఁ దరులు, రాలు గరగె
       నేమిచెప్పవచ్చు నేలోకముననైన
       గానమునకు సాటి గానఁగలదె?

గానమందీయన, చెట్టుక్రింది ప్లీడరువంటివాడేకాని, “సంగీత కళా రహస్యనిధి" యైన వసుచరిత్ర కవివంటివాడు మాత్రం కాడు. యేమంటే భట్టుమూర్తి కాంభోజీరాగంతో నాయకురాలిని యేడిపిస్తే, మా ముత్తాతగారు కళ్యాణీరాగంతో యేడిపించారు. దీన్నిబట్టి ఆలోచిస్తే గాలిపాటపాడే వారేకాని, రహస్యజ్ఞులు కారని తోచకమానదు. కాంభోజివలె కళ్యాణికి కరుణరసమును బ్రకటించు శక్తిలేదనుకుంటాను. అయిననూ యింకా దీన్ని గురించి గానవిద్యానిష్ణాతులు ప్రష్టవ్యులు.