పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

316

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఈయన యామినీపూర్ణతిలకావిలాస, వేంకటేశ్వర విలాసాలేకాక, అహల్యాసంక్రందన విలాసము, ఏకాంతసేవాకలాపము, ఏకప్రాసకంద గోపాలశతకము అను పొత్తములుకూడ రచించి యున్నారు. ఇందు తుట్ట తుదిదికాక తక్కిన రెండున్నూ యక్షగానములు. ఏకాంతసేవ మావూరి జనార్దనస్వామివారికి సంబంధించినది. ఆ యీ గ్రంథాలన్నీ నా చిన్నతనందాకా భద్రంగానే వున్నాయికాని, యిటీవల నేను బందరు ప్రవేశించిన రోజుల్లో కొన్ని నశించాయి. నశించినా అందులో చాలా భాగం అచ్చుపడడంచేత దొరికేవే. చేసినపాపం చెపితే పోతుందంటారు కదా! నేను బొత్తిగా చిన్నతనంలో వున్నప్పుడు లోకల్‌ఫండు స్కూల్లో ప్రవేశించిన కొత్తఱికంలో, నాకు పలకా, యేదో వకపుస్తకం, యింతకంటే యెక్కువ సరుకు లేకపోవడంచేత, నాదస్తరం యెత్తుగా వుండకపోవడం నాకు అవమానంగా తోచి యింట్లో తేరగావున్న తాటాకుల పుస్తకాలు కొన్ని దస్తరంలో వేసి పెద్దదిగా కట్టుకొని స్కూలుకు వెళ్లేవాణ్ణి. ఆకట్టుకోవడంలో పొడుగు తగ్గించవలసి వచ్చేది. ఈ కారణంచేత కొన్ని నాచేతులారా ధ్వంసంచేసి వుంటానని నాకు తోస్తోంది. ఆ సందర్భంలోనే తుట్టతుది మూడు పుస్తకాలూ పోవలసినా, యిటీవల కూడా నేను చూచినట్లు జ్ఞాపకంవుంది. ఏలాపోయినాయోగాని, అవి యిప్పుడు కానబడవు. సుప్రసిద్ధ ప్రబంధాలు రెండుమాత్రం యిప్పటికీ వున్నాయి. యామినీపూర్ణతిలక వేయిపద్యాలకు మించుతుంది. వేంకటేశ్వరవిలాసం అయిదువందలకు లోగానే వుంటుంది. వంశాన్ని గురించి రెండోదానిలోనే కొంతవిస్తరించారు. దీన్నిబట్టే నేను దేవీభాగవతంలో- “కులవిధమ్మునెల్లను పిన్న ముత్తాత తనదు గ్రంథముల విస్తరించె నాకన్న" అని యీయన పుస్తకానికి బరాతం పెడుతూ, ఈయన తరం దగ్గిఱనుంచి మాత్రమే యెత్తికొన్నాను. ఇంటిపేరు వచ్చిన సందర్భంకూడా ఈయన- “ప్రవరుల్ కొందఱు మేలుకోట గల చెల్వపిళ్లరాయండు” అనే పద్యంలో విస్తరించుటచే నేను దాన్ని గుఱించి మళ్లాయెత్తుకోక-“ఇంటి పేరెఱుఁగఁ జెప్పెదను చెళ్లపిళ్లవారు" అని మాత్రం వ్రాసి వూరుకున్నాను. మా ముత్తాతగారు వ్రాసిన వ్రాతనుబట్టి యింటిపేరు మొదట చెల్వపిళ్ల వారనిన్నీ అదే వాడుకలో చెళ్ళపిళ్లగా మాఱిందనిన్నీ తేలుతుంది. మా ముత్తాతగారేనా వంశం అంత తప్సీలుగా వ్రాయనేలేదు. తప్సీలుగా వ్రాసేయెడల, మాకు వారసత్వరీత్యా సాలువక్కంటికి రెండు మూడువేల రూపాయిల రాబడిగల స్థిరాస్తి కలవడాని కవకాశ మిచ్చేది. దానికి యిప్పుడు యత్నం చేస్తే యీయన వ్రాతలో ఆధారం స్పష్టంగా లేకపోవడంచేత యేమవుతుందో అని సందేహించి వూరుకోవలసి వచ్చింది.

మా తాతగారు మా తండ్రులలో రెండవఆయనకు నరసకవిగారి పేరు పెట్టేరు కాని, చేవ్రాలుతప్ప ఆయనకేమీ విద్య అంటిందికాదు. ఈయనకు మాత్రమే కాదు, ఈయన