పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


దానిమీద మా ముత్తాతగారు వృత్తంకూడా సరిగానే చెప్పినానని నిర్భయంగా బదులు చెప్పేరనిన్నీ, అయితే లక్షణం చదువుమన్నారనిన్నీ వెంటనే కల్పనచేసి గురువుగారన్న వృత్తానికే తాను చెప్పినది సరిపడేటట్లు లక్షణం కూడా ఆశువులో రచించి సరిపెట్టేరనిన్నీ అది అసత్యమైనప్పటికీ మొదట చెప్పిన వర్ణనకంటె ఇది చాలా శ్లాఘాపాత్రమని గురువులచే మెప్పించుకున్నారనిన్నీ జనశ్రుతి. ఇదెంత సత్యమో నిర్ణయింప నాధారంలేదు. గురువు కోరిన వృత్తం పేరేదో తెలియదు. ఈయన చెప్పిన లక్షణ శ్లోకమున్నూ వుపలబ్ధం కాలేదు. ఈయన రచించిన వృత్తం పేరు వసంతమాలిక. గురువుగా రడిగినదిమాత్రం ఈ పేరు కలదికాదని వినికిడివల్ల యెఱుగుదును. దీనివల్ల అత్యాశుకవియని మాత్రం మనం తెలిసికోవచ్చును.

ఇదివరలో వ్రాసిన రాజబంధువులుకాకా, మాగ్రామంలో పేరు ప్రతిష్ఠలుగల వెలంవారు మఱికొన్ని కుటుంబాలవారు పూర్వకాలంలో వుండేవారు. వారుకూడా కొందఱు మాముత్తాతగారివద్ద శుశ్రూషచేసిన శిష్యులే. మా ముత్తాతగారికి ఆదొండకాయకూర చాలా యిష్టమవుటచేత ఆ వెలమశిష్యులు తఱచు ఆ కాయలు తెప్పించి పంపించడం కలదట. వకనాడు దానిమీద పద్యం చెప్పవలసిందిగా కోరేటప్పటికి ఈ పద్యం చెప్పేరట!

మ. ఠవణింతున్నుతి దైవతప్రమదదార్ఢ్యన్మోహినీనీరభృ
     చ్యవమానామృతశీకరాభనవబీజప్రాంతరౌపమ్య స
     ద్భవనాజాండకు షడ్రసప్లుతసముద్యత్స్వాదుమత్ఖండకున్
     అవితుంగోద్భవకాండకున్ సరసమోహాఖండ కాదొండకున్.

ఈ పద్యాన్ని తెనాలి రామలింగకవికృతంగా నెవరో కొన్నాళ్ల క్రిందట యేదో పత్రికలో ప్రకటించినట్లు జ్ఞాపకం. ఎవరిదాకానో యెందుకు? మా శిష్యుడు ప్రభాకరశాస్త్రే ఈయన పద్యం రామలింగకవిదని వ్రాసినట్లు జ్ఞాపకం. బహుశా, ఆ పద్యం కూడా ఇదేనేమో. సుమారిప్పటకి నలభైయేళ్లనాడు, యెవరో జ్ఞాపకంలేదు గాని, మా ముత్తాతగారి గ్రంథంలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన “సీ. శరదంబువేణికి శాంతభావముచెందె." అనే పద్యాన్ని రామలింగకవి కర్తృకంగా వ్రాశారని జ్ఞాపకం. రామలింగకవికృతమైన పద్యము సీ.ద్విరదంబు నడతోడ" అనేది. దాన్ని వరవడిగా బెట్టుకొని మా ముత్తాతగారు రచించినది పైపద్యం. యథార్థ మీలా వుండగా ఎవరో యేదోరీతిని వ్రాస్తే దాన్నే లోకం నమ్ముతోంది. నిన్న మొన్నటిచరిత్రలను గూర్చిన నిజస్థితులే ఇలా తారుమారవుతూవున్నాయి. యిక ప్రాచీనాలని గురించి వ్రాయవలసిందేమి? అంతదాకా యెందుకు? వర్తమానకాలికమైన మా జీవితాన్ని గురించి వ్రాస్తూ వున్నవారి వ్యాసాల్లో కూడా వ్యత్యస్తాలు బోలెడు కనుపడుతున్నాయి. అది అలా వుంచుదాం.