పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా ముత్తాత

311


అది యెంతవరకు అనుభవంలో వుందో అని నాకు సందేహం. ఈ సందర్భాలన్నీ స్తనశల్యపరీక్ష చేసేవారికిగాని స్థూలదృష్టి వారికి యింత సలక్షణకవి ప్రపంచంలో పుట్టనేలేదన్నంత గౌరవంకలదు. ఆ నమ్మకం యెవరికో యెందుకు? నా గురువులలో వకరున్నూ, కేవల సాహిత్యపరులున్నూ అయిన మధునాపంతుల సూరయ్యగారికే వుండేది. ఇటీవల నే నెప్పుడేనా ఆయీ విచారణాంశాలు ముచ్చటిస్తే, “తాతా,. యింకా ఆలోచించాలేమో" అనేవారు. ఈ ఆలోచించడంలో నాకున్న చేదస్తం యెవరికోగాని వుండదు. రామశబ్దం సర్వసమ్మతమైనా అదికూడా నిరాఘాటంగా ప్రయోగించడానికి నేను సందేహించడం కలదు. అట్టి పరమచాదస్తుణ్ణి నేను; గ్రంథమో, మా ముత్తాత కవిత్వం. అట్టి స్థితిలో ఇతరులెవరేనా తప్పంటే పోట్లాడవలసిన దానికి నేను తప్పంటానా? పేరెందుకు వ్రాయడం. బందరులోనే మా ముత్తాతవంటివారో, ఇంకా గొప్పవారో, ఒక విద్యావయోవృద్దులు, మహాకవులు వుండేవారు. ఆయన పాండిత్యం, అసదృశం. చాలా గ్రంథాలు వ్రాశారు. ఆయన కుమాళ్లు కూడా ప్రాజ్ఞులే. తండ్రిగారి కవిత్వమందేమి, తండ్రిగారియందేమి, మిక్కిలి భక్తులు. వారి కవిత్వములోనున్నూ మా ముత్తాతగారి కవిత్వంలోవలెనే ప్రమాదాలు విస్తరించి వున్నాయి. అంత గొప్ప పండితుల కెందుకుండాలి? అనకండి, నా అనుభవంలో పాండిత్యంవేఱు, పరిశీలన వేఱు, పరిశీలనగలవారు నూటనాటగాని పండితులలో తఱుచుగా వుండరు. హరిశాస్త్రులవారి శిష్యులు ఒకరు మహావైయాకరణులై కూడా తప్పుల కుప్పగా వ్రాసిన పుస్తకాన్ని నేను చూచాను. ఎవరేనా చెప్పితేనే గాని అంతవఱకూ ఆయనకు తప్పని తెలియనే తెలియదు. ఏమనుకోవాలి? ప్రస్తుతానికిరండి. అవి ప్రమాదాలని యెవరేనా అంటే, వారి కుమాళ్లు, జవాబు చెప్పడానికి ఆధారం లేకపోయినా, వప్పుకొనేవారు కారు. ఎవరికుమాళ్లు! బందరులోవారి కొమాళ్లు, నేనుకూడా మా ముత్తాతగారి యెడల అట్టి భక్తినే చూపవలసివుండగా చూపలేకపోతిని గదా అని విచారిస్తున్నాను. వీరేశలింగంపంతులవారు కూడా ఆముక్తమాల్యద వగయిరాలలో తప్పులున్నాయన్నారు గాని, మా ముత్తాతగారి విషయంలో కలం ఆ ధోరణికి తిప్పనేలేదు. ఈ “తాతామనుమల వరస” నాకే తటస్థించింది. ఇంతమాత్రంచేత నేను మా ముత్తాతగారియందు గౌరవంలేనివాడనని పాఠకలోకం భావించకూడదు. "పెద్దకవీంద్రుఁడై" అని యెత్తుకున్నాను గానా? ఇంకా చూడండి

“మ. అనఘుండై, మదనాభిరామనృపకన్యాచిత్రచారిత్రమున్
      జననుత్యమ్మగు వేంకటేశ్వరవిలాసంబున్ దగంజెప్పి రా
      మున కర్పించి పరంబుగన్న మహితున్‌ముమ్మాటికిం గొల్లు నా
      పినముత్తాత నగణ్యపుణ్యవిభవాబ్ది న్నారసింహాఖ్యునిన్." -