పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


తప్పులన్నీ ఆ జంగందేవర నెత్తిని రుద్దడానికి స్థూలదృష్టుల కవకాశం కలిగింది. లేకపోతే ఈ అవకాశానికి హేతువుండదు. ఆ తప్పులలో మాదిరి కొకటి చూపుతాను.

“ఆ రాజేంద్రునిసగు భా ర్యా రతిశాస్త్రానురూప.” ఈ పద్యంలో, “భార్యా" శబ్దాన్ని హ్రస్వం చేయకుండా ప్రయోగించడం కవికృతంగాని యితరులదికాదు. ఇది దిద్దవలసివస్తే యెట్లా! అసాధ్యస్థలంలో వుంది. దిద్దవీలైనవికొన్ని వేంకటేశ్వరవిలాసంలో దిద్దాను. చూడండి.

"అలరు మందాకినీ యార్యాసహాయుఁడై పొలుపొందు సర్వజ్ఞ మూర్తియనఁగ" ఇందు మందాకినీ + ఆర్యా, అన్నచోట, సంస్కృత సంధి యణాదేశం రావాలి. ఆయన కీమాత్రమున్నూతెలియదా? తెలిసినప్పటికి మొదట తెలుగు కవిత్వాని కలవాటు పడడంచేత తెలుగు వ్యాకరణ మర్యాదగా యడాగమం పడ్డది. ఇది పూర్వాపరాలు చేయించే పురోహితుడికి అందులో మంత్రాలిందులోనూ, ఇందులో వందులోనూ దొరలడం వంటిది. ఈసంగతి అనుభవజ్ఞులకు తెలుస్తుంది. ఇంతమాత్రంచేత ఈయనకు కౌముది రాదనుకోవడం యుక్తంకాదు. యేమంటే : స్వదస్తూరీతో వ్రాసికొని చదివిన కౌముది ఆయన పుస్తకసామగ్రిలోనే వుందే? నేను దానిమీదనే కదా వ్యాకరణం చదవడాని కారంభించింది? ఎఱిఁగి కూడా తప్పువ్రాస్తేనే ప్రమాదమనుకోవాలి. ఈలాటి చోట్లనే "ప్రమాదోధీమతామపి" అని సమాధానం చెప్పుకోవడం. అచ్చులో "మందాకిన్యహార్యజా యుఁక్తుఁడై" అని సవరించి ముద్రింపించాను. ఈయన బుద్ధిపూర్వకంగా సమ్మతించి ప్రయోగించిన అఖండయతులేమి, కొన్ని తెలుగు వ్యాకరణ విషయాలేమి, మొట్టమొదట నాకు నచ్చినరీతిని వేంకటేశ్వరవిలాసంలో సవరింప మొదలుపెట్టి కొంత ముద్రణం జరిగినమీద ఈ పని అంత వుచితంకాదని మానివేశాను. కాని దిద్దిన భాగమే యొక్కువ.

మహాకవి, పండితకవి అయిన ఈయన కవిత్వమందు అన్ని లక్షణవిరుద్దా లెందుకున్నాయి. అని ప్రాజ్ఞులు శంకింపవచ్చును. వినండి : ఈయన కాలంనాటికి పుస్తకాలింకా సులభంగా అచ్చుపడి దొరకడంలేదు. ఎవరినో ఆశ్రయించాలి, సంపాదించాలి. అట్టిస్థితిలో ఆంధ్రలక్షణ గ్రంథాల్లో ముఖ్యమైన అప్పకవీయం ఈయనకు దొరకనేరదు. “అప్పకవీయంలోని కొన్ని యతిప్రకరణాలు" అనే శీర్షికగల సుమారు జానెడు పొడుగు తాటాకులు ఆఱో, ఆఱున్నొకటి మాత్రమో గల చిన్న పుస్తక మీయన పుస్తకసామగ్రిలో కనబడుటచే ఈయన కాధారం సులక్షణసారం వగయిరాలని స్పష్టంగా నిర్ణయింప వీలయింది. సంస్కృత వ్యాకరణ విరుద్ధాలు కూడా దీర్ఘసమాసాలలో క్వాచిత్కంగా లేకపోలేదు. ఏమంటే వయస్సు కొంత ముదిరినపిమ్మట కౌముది చదివినప్పటికీ యీయనకు