పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/304

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

308

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యామినీపూర్ణతిలకావిలాసం కనపడ్డది. అప్పటికప్పుడే ఈ గ్రంథం పేరు చాలా వ్యాప్తిగా వుండడంవల్ల, కనపడేటప్పటికి “ఇప్పడే చూచియిస్తానని పుచ్చుకొని, తుదకు స్వగ్రామం పట్టుకువెళ్లి వ్రాసికొని పంపిస్తానని చెప్పి, యియ్యనేలేదు. గట్టిగా మాట్లాడితే అధికారితో పని. అప్పటి కాలంలో అధికార్లంటే వుండేభయం ఇప్పటివారికి బాగా తెలియదు. అప్పుడు కరణాలన్నా ఠాణాదార్లన్నా చాలా భయపడేవారు. అందుచేత మళ్లా గట్టిగా అడగాలేదు, ఆయన యివ్వాలేదు.

“పుస్తకం వనితా విత్తం, పరహస్తగతంగతం" అనే యోగంపట్టి నా బాల్యంనాటికి ఆచిత్తుప్రతే గతి అయింది. తరువాత ఆ అప్పలరాజు గారు గతించారు. నేను చామర్లకోటలో మాధుకరం యెత్తుకుంటూ చదువుకొనే రోజుల్లో చాలసార్లు పిఠాపురం యిందుకోసమని వెళ్లి యీశుద్ధ ప్రతికొఱకు ప్రయత్నించాను గాని, వారి వంశస్థులవల్ల నాకది లభించనే లేదు. ఇంకొక శుద్ధప్రతి మా ముత్తాతగారి స్వహస్తలిఖితమే ఆపుస్తక సామగ్రిలోనే కనపడ్డది. దానిలో కొన్ని మార్పులున్నూ కొన్ని కొత్త పద్యాలున్నూ వున్నాయి. గాని అందులో రెండాశ్వాసాలకు లోపుగానే గ్రంథం వుంది. బహుశః ఎందుకేనా మంచిదని మఱొక ప్రతి వ్రాయడానికి మొదలుపెట్టి పూర్తికాకపూర్వమే మధ్యకాలంలో పరలోక గతులైరని వూహించవలసి వుంటుంది. ఏమంటే, ఈయన అత్తవారి వూరుకాకరపర్తి వెళ్లి, అక్కడ హఠాత్తుగా మరిడీజాడ్యంవల్ల స్వర్గస్థులైనట్లు విన్నాను. ఈ హఠాన్మరణహేతువుచేతనే, అన్నదమ్ములు అంతకుముందు పంచుకొన్ననూ ఈ గ్రామంలోవున్న రికార్డుయావత్తూ మాతాతగారికి చేజిక్కి సమష్టి అని వాదించడానికి అవకాశం కలిగింది. అప్పటికి నరస కవిగారికి పురుషసంతానం నష్టమైననూ, స్త్రీ సంతానం కలదు. వ్యష్టి అవడంవల్ల ఆయన వాటా ఆపెకు వెళ్లడం న్యాయం. అయినా మా తాతగారు సమష్టివాదం పెట్టి కోర్టులో గెల్చుకున్నారట. అందుచే నరసకవి గారి భార్య మనోవర్తిదారురాలయింది. ఈమె పేరు గవరమ్మగారు. ఈవిణ్ణి నేను ఎఱుఁగుదును. ఈమె నరసకవిగారికి రెండవభార్య మాతాత గారిని నాయెదుటకూడా శపిస్తూ వుండేది యీవిడ.

అయితే యింకొకటి విన్నాను. నరసకవిగారు కాకరపర్తి వెళ్లేటప్పుడు మా తాతను పిల్చి “పుస్తకాలు జాగ్రత్తా" అని చెప్పి వప్పగించి వెళ్లినట్లు చెప్తారు. ఆలా వప్పగించడాని కారణం, ఆయనకు జ్యెతిష ప్రవేశంకూడా వుండడంచేత మృత్యుకాలం తెలిసి మరణం నిమిత్తమే వసిష్ఠానదీతీరమైన కాకరపర్తికి వెళ్లి వుంటారనిన్నీ అందుచేతనే ముగ్గురు సోదరులకూ మొత్తం వారసుగావున్న మాతాతగారికి వప్పజెప్పితే తప్ప ఆడవాళ్లవల్ల యీ పుస్తకాలు భద్రపఱపబడవనిన్నీ వూహించి అలాచేసి వుంటారనిన్నీ కొందఱనగా విన్నాను.