పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కూర్చిన నిర్దుష్టప్రతి చూచే అదృష్టం కలగనేలేదు. కారణమేమంటే, మా తాతగారు, వెంకన్నగారు, ఈ నరస కవిగారి పెద్దన్న కామయ్యగారి కొడుకగుటచే, ఈయన అనంతరం ఈయనకు పురుషసంతానం లేకపోవడంచేత ఈయన తాలూకు యితరాస్తితోపాటు పుస్తక సామగ్రిని కూడా వశం చేసికొన్నారు. ఈయనవద్ద బాగా చదివినట్టయితే మా తాతగారు ఈయన ప్రతిష్ఠని పూర్తిగా నిలపదగ్గ వాగ్దాటీ, వాజ్మాధుర్యమూ కలవాఁడేకాని, మనస్పర్ధలు కలిగి కాళి దాసత్రయం లోపునే చదువు చాలించారని వినికి. మనస్పర్థకు కారణం; నాఁటికాలపు పిఠాపురపు ప్రభువు శ్రీ నీలాద్రిరాయనింగారికి మా ముత్తాత నరసకవిగారి ముఖ్యశిష్యులైన చింతపట్ల వేంకటరాయు, మాధవరాయనింగార్లనే సోదరులు మేనమామలయిన హేతువుచేత, వారు చాలాసార్లు మేనల్లుడి దర్శనానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే, అప్పటి కాలపు పండితులలో యెవరో తప్ప సర్వసామాన్యంగా నిస్పృహులుగావుండి, "పంచమేహని షష్ఠేవా శాకంపచతి స్వేగృహే” అనే శ్లోకార్ధాన్ని గుఱి చేసికొని వర్తించేవారే అవుటచేతనూ, మా ముత్తాతగారుకూడా ఆ తెగవారిలో అగ్రేసరులై వుండడంచేతనూ, యెన్నడున్నూ స్వగ్రామం వచ్చియున్నప్పటికీ ఆ ప్రభువును చూడడానికి వెళ్లనేలేదనిన్నీ దానిమీఁద శిష్యులు మేనల్లుడితో విస్తరించి యీయన్ని గుఱించి తఱుచు చెప్పి వుండడంచేత నేమి, ఆ ప్రభువు రసజ్ఞుఁడైన కారణంచేత నేమి, యెట్లో యీయన్ని చూచి యీయన ముఖతహా కొంతవిని యీయన్ని సమ్మానించాలని బుద్ధిపుట్టి మేనమామలతో దానిని సంఘటించవలసిందిగా కోరితే, వారు “మనయింటికి శాస్త్రులవారు తఱచు దయచేస్తూనే వుంటారు, తాము దయచేస్తే వారిథోరణి విని యానందించడం తటస్థిస్తుంది." అని చెప్పేటప్పటికి, మంచిదని ఆ ప్రభువు తమదివాణానికి సమీపంలోనే వున్న మేనమామల యింటికి వచ్చి చాటుగా కూర్చుండి అంతకు ముందే ఆసమీపపుగదిలో గ్రంథకాలక్షేపం చేస్తూవున్న మా ముత్తాతగారి వాగ్ధోరణివిని, ఆనందించి, అప్పుడు యెదురుకుండా వచ్చి సగౌరవంగా ఆదరించి “కోరుకోవలసిం” దన్నారనిన్నీ దానికి మూ ముత్తాతగారు “మీదయవల్ల సమస్తమూ వుంది (మనసిచ పరితృప్తే కోஉర్థవాన్ కోదరిద్రః) లోటు లేదు.” అని చెప్పి యేమిన్నీ కోరలేదనిన్నీ తరువాత రాజుగారు బలవంత పెట్టఁగా, దానం పట్టడానికి బొత్తిగా ఇష్టంలేక "అయ్యా! మాకు సుమారు మీ జమీందారిలో వున్న భూమి అయిదుపుట్లలో (అనగా నలభై యకరాలలో) నామూడోవంతుకు పుచ్చుకొనే కట్టుబడిపన్ను కొట్టివేయించవలసిం"దని మాత్రం కోరేరనిన్నీ ప్రభువు ఆలాగే చేశారనిన్నీ వినికి. ఈయంశం గీరతంలోకూడా టూకీగా వుదాహరించాను. ఇందులో నిజమెంతో, కల్పితమెంతో నిశ్చయించడానికి ఆధారం తక్కువ. ఆలాకొట్టి వేయడానికి పూర్వం యెంతపన్నువుండేదో తెలుసుకొందామంటే వీలుచిక్కిందికాదు. రాజదర్శనానికి