పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

305



మా ముత్తాత

“పెద్ద కవీంద్రుఁడై పేరుచెందినవాఁడు పిన్న ముత్తాత నర్సన్నగారు” అని దేవీభాగవతములో వంశవర్ణనారంభమందు పేర్కోబడ్డ నరసన్నగారు మాముత్తాతలు ముగ్గురిలోనూ ఆఖరువారు. మొదటివారు కామయ్యగారు, రెండవవారు అన్నయ్యగారు. వారిరువురినీ వదలి ముందుగా ఈయన పేరెత్తడానికి కారణం విద్యావృద్ధత్వమే. ఈయన యిప్పటికి సుమారు నూటపదకొండు సంవత్సరములకు పూర్వము, అనఁగా స్వభాను సం|| ఫాల్గున శు 3 గురువారం నాటితో పూర్తిగా వ్రాసికొని ముగించి ఆ తేదీని తుట్టతుద చేవ్రాలుతోసహా వ్రాసిపెట్టిన “ప్రయోగ ముక్తావళి" అనే ధర్మశాస్త్రం, తాటాకుల ప్రతి యిప్పటికిన్నీ మా యింట్లో ప్రతి నవరాత్రులలోనూ పూజింపఁబడుతూ చెక్కుచెమర్పకుండా భద్రంగా వున్నది. ఈయన జీవించిన కాలపరిమితి సుమారుగా వినికివల్ల యాభై నాలుగు. లేక యాభై అయిదు అని యెఱుఁగుదును. దాన్నిబట్టి చూస్తే ఆ ధర్మశాస్త్రం వ్రాసికొనే కాలంనాటికి సుమారు నలభై యేండ్లవయస్సు వాఁడు కావచ్చునని వూహించుకోవచ్చు. ఈ వూహ సరియైనదే అయితే, ఈయన జననం యిప్పటికి, అనగా క్రీ. శ. 1934 సంllరముకు సరియైన భావ సం|| ఆశ్వయుజ శుద్ధ తదియా గురువారం నాటికి, నూటయాభై యొక్క వత్సరప్రాంతంలో వుంటుంది. ఆ వత్సరాన్ని గూర్చిన చర్చ అవసరమైతే చదువరులే నిర్ణయించుకుంటారు కాఁబట్టి దీన్ని గూర్చి విస్తరించేదిలేదు.

ఈయన తన నివాసగ్రామమగు కడియానికి సుమారు మైలున్నరలో నున్న వేమగిరినివాసులు మేడవరపు కోనయ్యగారివద్ద తెలుగు చదువుకొన్నట్లు ఈయన కృతులలో ముఖ్యకృతియగు యామినీపూర్ణ తిలకావిలాసములో కనఁబడుతుంది- "కోనయాఖ్యాంధ్ర గురుకీర్తిఁ గూర్తు మదిని” అని పై పుస్తకాన్ని యీయన మొదట మూఁడాశ్వాసాలుగా రచించి అందులో దోషాలు విస్తారంగా వున్నట్టుతోచి, సంస్కృత సాహిత్యం కోసం కాకరపర్తిగ్రామం వెళ్లి అక్కడ శ్రీవేదుల వెంకట శాస్త్రులుగారివద్ద వ్యాకరణం చదివి, మళ్లా ఆ పుస్తకాన్ని సంస్కరించి ఆఱు ఆశ్వాసములు దాన్నిగా చేసినట్లు విన్నాను. దీనికితథ్యంగా ఆ మూఁడాశ్వాసాల చిత్తుప్రతి నా బాల్యంవఱకూ ఆయన పుస్తకసామగ్రిలో నిల్చివుంది. నాకు సంపూర్తిగా ఈ చిత్తుప్రతి మాత్రమే ఈయన స్వహస్తలిఖితం చూడడం తటస్థించింది గాని, సంస్కృత పాండిత్యం ముదిరిన మీఁద ఆఱాశ్వాసాలుగా మార్చి