పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనకటి పండితులు

295


గారి జీవయాత్ర మఱీ ఆశ్చర్యకరంగా వుండేది. యింకా ఆయన్ని యెఱిఁగిన ఆకాలపు మనుష్యులు కొందఱు అక్కడక్కడ వుండఁబట్టిగాని లేకపోతే నేను ఆయన్నిగుఱించి వ్రాసేవాక్యాలు శుద్ధ అబద్ధాలే అనుకుంటారు యిప్పటివాళ్లు. అయ్యయ్యో ఆజీవితానికిన్నీ యిప్పటి వారి జీవితాలకీ లేశంకూడా పోలికేలేదు. యిప్పుడు భాధాంతం తర్కం చదివినా సరే, భాష్యాంతం వ్యాకరణం చదివినాసరే, వారిని ఆదరించేవారు లేకపోవడంచేత మళ్లా భాషా ప్రవీణపరీక్షకు చదివి ప్యాసై అక్కడినుంచి వారినీ వారినీ ఆశ్రయించి సిఫారసుత్తరాలు సంపాదించుకొని యేస్కూల్లోనేనా పండితపదవి సంపాదించుకోడానికి యజమానులదగ్గరకి కాళ్లరిగేటట్లు తిరిగీనిన్నీకృతార్థులు కాలేనివారినిచూస్తే యెంతో విచారం వేస్తుంది. యింకోవిశేషం : ఆ యీ వుద్యోగప్రదాతల్లో కొందఱు నిన్నా నేఁటిదాఁకా నిషధయోగ్యులుగా వుండి ఆఖరికి పంచతంత్ర మార్జాలాలుగా మారడంచేత కొందఱిస్థితి మఱీ శోచనీయంగా మాఱింది. పాపం పెళ్లాం పుస్తే పూసా అమ్మి వారిని సంతోషపెట్టాక ఆయీ సంతోషపెట్టిన వాళ్లలో కొందఱికి ప్రతిఫలం కలిగించేటంతలో – “భాషామంజరీ సమాప్తా" అన్నట్లుగా యేదో అవాంతరం వచ్చి వారికివున్న అధికారంకాస్తా వూడి పోవడం (అధికారాంతము నందుఁ జూడవలదా! ఆ యయ్య సౌభాగ్యముల్) తటస్థమై తక్కినవాళ్లగతి - "రెంటికి చెడ్డ రేవణ” కావడం వింటే యెవరి మనస్సుకేనా విచారం కలక్కపోదుగదా? వెనకటి పండితుల్ని యెన్ని విధాల బలవంతపెట్టినా, బతిమాలినా భృతకోపాధ్యాయత్వానికి “ససేమిరా” అనడమేకాని ఆమోదించడమంటూ వుండేదే కాదు. యిప్పుడో ఆ మహా పదవికి లంచపంచాలుకూడా సమర్పించడమే కాకుండా పడరాని పాట్లన్నీ పడడంచేస్తే, పృథివి పుట్టింది మొదలు యీలాంటి దరిద్రదశ పాండిత్యానికి పట్టలేదనే అనుకోవాలి. యీలాటి వారిని ఆవుద్యోగప్రదాతలు యీసడించారంటూ చాటునా మాటునా వీరు సణుక్కోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయీ యీసడింపు “నాన్ బ్రామిన్సు మూమెంటు" మూలంగా వచ్చిందంటూ కొందఱు సణుక్కుంటారు. యివి మఱీ పిచ్చి మాటలుగా నాకు కనపడతాయి. పండితుఁడు వుండవలసినవిధంగా వుంటే యే “మూ మెంట్లూ" వారిని యీసడించకపోను. వృథాగా అన్యాయ ప్రవర్తనకు అధికారికి మార్గం చూపే యీపండితులమీఁద గౌరవం “నాన్ బ్రామిన్సు" కే కాదు “బ్రాహ్మిన్స్"కు మాత్రం యేలావుంటుంది? ఆకాలపు పండితులు బుఱ్ఱపోయినా సరే లౌకికవ్యాపారాల్లోకి అడుగుపెట్టేవారు కారు. చామర్ల కోట భీమవరంలో గుండుచేన్లుగారంటూ వొక వుడూలప్పండితులు వుండేవారఁట. ఆయనకి వసతివాడు లేమీలేవు. ఆకాలంలో వారుయత్నిస్తే యే. జమీందారులేనా ఆదరించి వసతివాడులు కల్పించి పూజించేవారే. కాని అందుకు ఆయనకి లేశమూ యిష్టం లేకపోవడంచేత కుటుంబపోషణకి యాయవారం