పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చొప్పదంటు శంకలు

291

 కుంతికి జన్మించినవాఁడా! అనే అర్థం లేశమున్నూ వివక్షింపవలసిందని కాదు. పద్యకవిత్వ మర్యాద యెఱిఁగినవా రందఱికి ఆ యీ స్వల్పాంశాలు హృత్కవిలే కనక విస్తరించవలసింది లేశమున్నూలేదు. కనక విస్తరించేదిలేదు. కవితాకన్యకను చాలామంది కవులు కూఁతురుగా రూపించుకొన్నారు. కొందఱో? భార్యగా రూపించు కొన్నారు. ఒకరిభావన వొకరికి బాధించదు సరికదా! వొక కవే వొకచోట వొకలాగున్నూ మఱోచోట మఱివకలాగునున్నూ భావించడంకలదు. ఆ భావనకూడా వకదాన్ని నొకటి బాధించదనియ్యేవే నా అభిప్రాయం. గద్వాల శతావధానంలో శ్రీరాజాగారు అడిగిన ప్రశ్నలో "స్త్రీలకు శృంగార రసోపయుక్తము లయిన అవయవాలన్నీ యెదటి భాగంలోనే వున్నాయిగదా! జడకూడా అట్టిఅవయవాలలోదే. యిది వెనకవుండడాని క్కారణమేమో చెప్పవలసిం"దని అడగఁబడింది. అప్పుడు ఈకిందిపద్యం చెఱివక చరణంగా చెప్పఁబడింది. దాన్ని వుదాహరించి కొన్ని మాటలు వ్రాస్తాను.

"సీ. పురుషాయిత మొనర్చుపూఁబోఁడి కటిమీఁద
                 నాట్యంబుసల్పు పుణ్యంబు కొఱకొ?
      ఘననితంబస్థలంబను పెన్నిధానంబు
                 బహుభద్రముగను గాపాడుకొఱకొ?
      తానాశ్రయించు కొంతకు వెన్కభాగమ్ము
                ననుగూడ సౌందర్య మనుచుకొఱకొ?
      పదిమంది దృష్టులు పడిన “కంటక" మంచు
                నూహించి కనుపడకుండుకొఱకొ?

తే.గీ. వేణి కాంతలవెన్నంటి వ్రేలుచుండె
      లేకయుండిన నిధువనలీల కుపచ
      రించు నంగమ్ము లెదుటనే సంచునించ
      దాని కట్లుండ నే యుపద్రవము వచ్చె?”

అని చెప్పేటప్పటికి శ్రీరాజావారన్నారుగదా! “యేదో వుపద్రవం వచ్చినట్టు చెప్పఁగలరా?" అన్నారు. దానిమీఁద యీపద్యాన్ని చెప్పాము.

“మ. ఎదుటన్ వర్తిలునట్టి యంగముల కెంతేని న్నఖాదిక్షతా
      పద పల్మాఱును గల్గు సంగతిని దాఁ బ్రత్యక్షముం జూచి నె
      మ్మదిలో భీతిలి చాటుచోటనుచు సంభావించి వెన్నంటుచున్
      బొదలంబోలును వేణి, లేకునికిఁ దా ముందుండ కట్లుండునే?"