పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290



చొప్పదంటు శంకలు

వికట విమర్శనం అంటూ కొన్ని పనికిమాలిన శంకలు నేను చేయడమే అవకతవకగా వుంటే దాన్ని కొంత బలపఱుస్తూ యేవో కొన్ని మాటలు వ్రాసిన శ్రీయుతులు జటావల్లభులవారు మఱో శ్లోకాన్ని కూడా వుదాహరించడానికి నేను మఱీ విచారపడుతూ వున్నాను. కాళిదాసుగారికివుండే పాండిత్య కవిత్వాది ప్రజ్ఞల మాట ఆలా ఉంచుదాం.

లోకజ్ఞానంలో యెన్నో వంతున్నూ కూడా యే విమర్శకులకుఁగాని, ఏ కవులకుఁగాని వుండవంటే అంగీకరించనివారెవ్వరు? అట్టి సందర్భంలో ఆయన కవిత్వంలో చొప్పదంటు శంకలకు వుపక్రమించడంకన్న సాహసం వుంటుందా? ముఖ్యంగా భూమిని నాయికగా రూపించుకోవడంవల్ల వొక్కొక్క రాజు, అమ్మ మొగుడుగా, నాయనమ్మ మొగుడుగా కావలసివస్తుందనే భావాన్ని నేను తీసినమాట సత్యం. యీభావం ప్రతికవి కవిత్వంలోనున్నూ అంతో యింతోవస్తుంది. యీమాత్రం జ్ఞానంలేక ఆయా కవులు ఆరీతిగా చిత్రించలేదు. వారికి పూర్తిగా తెలుసును. కాని రూపకాలంకారరీత్యా (Metaphor) ఆరోపితమైన నాయికాత్వం విషయంలో యిట్టి అపార్థ కల్పన చేయడం లేశమున్నూ సమంజసం కాదని ఆయా కవులెఱుఁగుదురని వేఱే వ్రాయనక్కరలేదు. యిది చాలా కల్పించడమనేది మన అజ్ఞతను ప్రకటించుకోవడం తప్ప మఱొకటి కాదని తెల్పడానికే నేను భంగ్యంతరంగా ప్రవర్తించానని పూర్తిగా శ్రీజటావల్లభులు గ్రహించేవున్నారు. కనక విస్తరించేదిలేదు. యీ శంకలవంటివే నన్నయ్యగారి భారతంలో

“చెప్పుము నాకుఁ బయోరుహాననా!” అనేచోట గరుత్మంతుఁడు తల్లిని “పయోరుహాననా!” అంటూ సంబోధించడం బాగులేదనే ఆక్షేపణమున్నూ యముఁడు సావిత్రినిగూర్చి "తనులతాంగి! భవదుదారవాగ్భంగికి, మెచ్చువచ్చె" అనేచోట “తనులతాంగి!" అని సంబోధించరాదనే ఆక్షేపణమున్నూ, యీ రెండు స్థలాలలోనున్నూ అవయవార్థ వివక్ష చేసుకోరాదని గ్రంథకర్తల తాత్పర్యమని వేఱే వ్రాయనక్కఱలేదు. ఒకచోట "అమ్మా!" అనిన్నీ వేఱొకచోట, "అమ్మాయీ!" అనిన్నీ మాత్రము అర్థంగాని అన్యంకాదు. నన్నయ్యగారు ద్రౌపదీ వివాహఘట్టంలో అర్జునుఁడి చేత కర్ణుణ్ణి "కానీన" అని సంబోధింప చేయడంకూడా అవయవార్థం చెప్పుకోవలసిందనే తాత్పర్యంతోకాదు. "కానీన" అంటే? ఓ కర్ణా! అని మాత్రమే అర్థం చెప్పుకోవలసిందనియ్యేవే. అంతేకాని కన్యకావస్థలోవున్న