పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


"చక్కని రాజామార్గాలుండగా సందులుదూరడం” వంటివి. యూ మహాపురుషుణ్ణిగూర్చి యీ రెండక్షరాలున్నూ వ్రాయడం వల్ల నా జన్మ తరించిందని నేను సంతోషిస్తూవున్నాను.

యిప్పడుకూడా యిలాంటి అన్నదాతలు మాజిల్లాలో సకృత్తుగా వున్నారు. మా బంధుకోటిలో మంచి పండితులు శ్రీ నృసింహదేవర పేరు శాస్రుల్లుగారినిగూర్చి పలువురు యీలాగే చెప్పకుంటారు. యీయనవయస్సిప్పడు డెబ్భైకి పైమాట. యిట్టి వార్ధక్యంలో ఆకాలాన్ని అనంగా రాత్రి యే రెండుజాములవేళో వచ్చిన యేనిమ్నజాతికేనాసరే వకళ్లని శ్రమపెట్టడం యెందుకని యింటోవాళ్లని లేపక తామే స్వయంగా వండికూడా భోజనం పెడతారని వినికి. కొడుకులూ కోడళూ మనుషులూ బోలెండు బలగంతో యీ పుణ్యపురుషుండు ధర్మపత్నీ సహితంగా ఆలమూరులో యీ దీర్ఘసత్రాన్ని జరుపుతూవున్నారు. మన పూర్వపు ధర్మాల పద్ధతి యిది. ఇప్పటి పద్ధతి యింకోమాదిరిగా వుంటుంది. కాని నవీన పద్ధతిలోకూడా కొన్ని గౌరవించతగ్గవి లేకపోవు. కాని యీ ధర్మవ్యవస్థ తెలుసుకోవడం చాలా కష్టం భారతంలో యెల్దన్నగారు వక పద్యాన్ని వ్రాశారు.

క. ఈలోకము యగుంగొందఱ
కాలోకము కొందఱకు, నిహమ్మను బరమున్
మేలగు గొందఱ, కధిపా!
యేలోకము లేదుసూవె? యిలగొందఱకున్.

మన పూర్వులలో ప్రాజ్ఞల ధర్మాధర్మాలు సర్వమున్నూ ఈ పద్యార్థంలో యిమిడి వున్నాయి.

విషయం విషయాంతరంలోదిగి అంతరిస్తూవుంది. యీ అజ్జాడ అన్నంభౌట్లుగారి యశస్సునువిని మారాజావారు పిలిపించి వారిని బలవంతపఱచి పిఠాపురం యెస్టేటులో మల్లవరం చెఱువు క్రింద మంచిభూమిని, - యెన్నియకరాలో చెప్పంజాలను, విస్తారమే వుంటుంది - పరిగ్రహింప చేశారు. నాకు కూడా ఆ చెఱువుకుసంబంధించిన భూమి మంచిదయితే కాదుగాని వూషరక్షేత్రం వుండడంచేత వీరి భూమినిగూర్చి కొంత నాకు తెలుసును. వారి కుటుంబంవారికి యింకా ఆ భూమి జరుగుతూనేవుందని విన్నాను. ఆ కాలానికింకా - “యీడిగముత్తికి జోడు శాలువలిస్తి" అనే మాదిరి దానాలు ప్రారంభం కానేలేదు కనుక మా రాజావారు చేశారంటే చేసిందల్లా పాత్రదానంలోకే చేరడం తటస్థించింది. యీ రాజావారి యింకొకదానాన్ని గూర్చి వ్రాసి ప్రధానాంశానికి వస్తాను.

పిఠాపురానికి సమీపంలో, గోరస, కొమరగిరి, అని రెండు గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లోవకదానిలో మదూరి దీక్షితులుగారనేవారు వేదాధ్యయనపరులు,