పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఇంద్రాణి అంటే (ఇంద్రస్య - భార్యా) ఇంద్రుని భార్య. వితంతువు అనే అర్థం వేదపరిభాషగాని శాస్త్రతః వచ్చేదికాదు. దీన్ని గూర్చి (పల్లెటూళ్ల పట్టుదలలు చూ.) అన్యత్ర చిరకాలంనాఁడు వ్యాకరించాను. ఇంద్రుని పెళ్లాం ఇంద్రాణి అయినట్లే ఇంద్రవాచకమే అయిన శక్రపదానికి శక్రాణి అనే రూపాన్ని పుట్టిస్తే యేం జరుగుతుందో వైయాకరణులు చెపుతారు. అది కవులపనికాదు. అయితే రుద్రాణి, భవాని, శర్వాణి, మృడాని యీ నాలుగున్నూ శివుని భార్యను చెపుతాయి. ఇంద్రుని భార్యను చెప్పేది ఇంద్రాణి ఒక్కటే. శివుని భార్యను శివాని అనేపదంతో వాడితేనో యేముంది. యద్దేవా దేవహేళనమ్. యిందుకోసమే “ఛందోవ్యాకరణాదివిత్" అన్నారు. ప్రస్తుతానికి వద్దాం. నాదృష్టిలో పౌరాణికులు ఘనులు. నీచులుకారు. నీచత్వఘనత్వాలకు దారిద్ర్యం కారణం గాదు. పౌరాణికుల వల్లనే గ్రంథకర్తకు గౌరవప్రదమే. తన రచనవల్ల పలువురు జీవించడం కన్న గ్రంథకర్తకు కావలసిందేమిటి?

మా నాటకాలు ప్రదర్శించి తద్వారా పలువురు జీవిస్తున్నారని విని నేను సంతోషించేవాణ్ణి. మనదగ్గిఱ డబ్బూ దస్కమూ పుచ్చుకోకుండానే ప్రదర్శించడానికి మఱీ సంతోషం కలిగేది. యిటీవల ఆ ప్రదర్శకులవల్ల ప్రదర్శనానికి “యింత" అంటూ మాకు ఫీజు యివ్వడం కూడా జరుగుతూ వుంది. యిది నా మనస్సుకు అంతగా నచ్చుబాటు లేకపోయినా పుచ్చుకుంటూ వున్నాను. కాని వెనుకటికాలం వాళ్లకు హోటల్ పద్ధతిలాగే యిదీ నచ్చదు. యెవరి రచన పదిమంది విద్వాంసులు నిర్వ్యాజంగా చదువుకుంటారో ఆ రచనే అదృష్టవంతము. ఆరచయితే అదృష్టవంతుఁడు. అట్టిసుయోగము ఆ గ్రంథ నిష్ఠమైన రసాన్నిపట్టి ఉంటుంది. యీ సందర్భం ప్రబంధాలకి సంబంధించేమాట. పురాణకవిత్వం పదిమందీచదవడం తన్నిష్ఠమైన పుణ్యగాథలనిబట్టిగాని రచననుబట్టి మాత్రమే కాదు. పురాణ కవిత్వం చాలా భాగం అనాదిగా చేదస్తంగానే వుంటుంది; వున్నా పౌరాణికులు దాన్ని మన్నిస్తూనే వుంటారు. పౌరాణికులు పూజ్యులు, గౌరవనీయులు, నమ్యులు.

★ ★ ★