పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/274

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

278

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


దీనిలో బట్టురాజులద్వారా ఆరోజులలో జరిగే కవితావ్యాప్తిని శ్రీనాథుఁడు తెల్పివున్నాండు. ఇప్పుడు అచ్చు రాఁబట్టి పూర్వపురీతిని వ్యాపించ నక్కఱలేదనుకోవచ్చును.

“నోటఁబడు తుంపురులేనియు నిప్పు
 డచ్చువచ్చినకతనన్ జగాన విలసిల్లెడి"

అయినా నాటకాలకు ప్రదర్శకు లేలాటివారో పౌరాణికులు పురాణాల కాలాటివారే. తఱచు పౌరాణికులు బీదవారుగా వుంటారు కనక నైచ్యాన్ని ఆపాదించవచ్చునందామా? సమ్మతమే. కాని ఆ పక్షంలో యీ దోషం పౌరాణికులకన్నా ముందుగా కవులకే తగులుతుంది కదా! నీచులు రచించినట్టున్నూ, నీచులు వ్యాప్తినందిస్తూ వున్నట్టున్నూ తేలుతుంది. అందుచేత ఆ హేతువుచే నైచ్యాన్ని ఆరోపించడం పొసఁగదు! ఆ దారిద్ర్యాన్ని కూడా మహాకవులు వొక ఆభరణంగానే అలంకరించుకున్నారు

(1) మాంతుభిక్షాటనమ్.

(2) శ్లో. నా౽స్మాకం శిబికా... విద్యానవద్యాస్తినః

(3) శ్లో. ఆరనాళగళ దాహశంకయా మన్ముఖా దపగతా సరస్వతీ.

కవులు దరిద్రులనడానికి మనహిందువులే కాదు ఆంగ్లేయులు, పారశీకులు లోనైనవారంతా వొప్పుకుంటారు. అంతమాత్రంచేత ఆ కవిరచనకు నైచ్యంరాదు. శ్లో. “భిక్షుణా కక్షనిక్షిప్తః కిమిక్షు ర్నీరసోభవేత్" -

అని పూర్వలే సమాధానమిచ్చియున్నారు. కవిరచనకు నైచ్యాన్ని సంఘటించేది గ్రంథంలో ప్రతిపాద్యమైన విషయంగాని, కవినిష్ఠదారిద్ర్యాదికం కాదు. కేవలమూ ప్రతిపాద్యాన్ని బట్టే గౌరవం రావడమూ కష్టమే. యిది మఱొకప్పుడు చూచుకుందాం. కవికి ఆగ్రహం కలిగి వ్రాసేవ్రాఁతలో కూడా ఔదార్యం వండాలి. అంతేకాని హేయ ప్రసంగం వుండకూడదు. తిడితే తిట్టినాఁడుగాని మృదువుగావుంది అని రసజ్ఞులు మెచ్చుకోవాలి. చంద్ర రేఖావిలాపంలా వుంటే అది హేయంగా కనపడుతుంది. ఈ విషయంలో దొరకకుండా వుండడం చాలాకష్టం. ప్రస్తుతం నాదృష్టిలో పౌరాణికులు గాని, పురాణాలుగాని, పురాణకర్తలుగాని, ఆంద్రీకర్తలుగాని, శ్రోతలు గాని వీరందఱూ పరమపూజ్యులుగానే తోస్తారు. వీరిని నీచులుగా పరిగణించి కవికవిత్వాన్కి నైచ్యాన్ని ఆపాదించేవారివూహ నాకు నచ్చక లేని వోపిక తెచ్చుకొని యీ నాలుగు మాటలూ వ్రాశాను. ఐశ్వర్యానికీ, కవిత్వానికీ ఎంతచుట్టఱికమో దారిద్ర్యానికీ, కవిత్వానికీ అంతే