పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

272

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యేటేటా పూజించే గణపతి యీ శాస్త్రులుగారు ప్రతిష్ఠించిన దైవతమే. ఆ పూజ ఆంధ్ర విద్యార్థుల యాజమాన్యం మీఁదనే మా విద్యార్థి దశ వఱకున్నూ జరిగేది. బహుశః యిప్పుడుకూడా డిటో ప్రకారమే జరుగుతూ వుందనుకుంటాను. మన ఆంధ్రులలో కాశీని కూడా వకమూలకు తెచ్చిన విద్వాంసులుండేవారని పయిసంగతి సాక్ష్యమిస్తుంది. నిన్న మొన్నటిదాఁకా సజీవులైవున్న శ్రీ మహామహోపాధ్యాయ భట్టాచార్య గంగాధర శాస్త్రుల్లుగారు కూడా ఆంధ్రులే. ఇట్టివారు బహుమంది మన ఆంధ్రులలోవున్నారు. ఆకాలంలో వేదశాస్త్ర శ్రౌతాలల్లో వ్యాసంగం చేసి లోకాతీతులనే పేరు పొందేవాళ్లుండేవారు. ఈ కాలంలో రాజకీయ భాషల్లో పాండిత్యం సంపాదించి ఖండాంతరాల్లో మహా మహోపాధ్యాయ స్థానాన్ని అలంకరిస్తున్నారు. ఉదాహరణం లేక ప్రథమోదాహరణం, శ్రీ రాధాకృష్ణన్. శ్రీ శిష్టాశాస్త్రుల్లుగారు బందరువారు కాకపోయినా కొంచెం పైకి వచ్చింది మొదలు తమ పాండిత్యాన్ని బందరుకే వినియోగించిన కారణంచేత బందరు పౌరులు వీరిని శ్రీయుతులు నాదెళ్ల పురుషోత్తమ కవివతంసునితోపాటు తమవారినిగా పేర్కొని గర్వపడుటకు శంకింపనక్కరలేదు. పురుషోత్తమ కవిగారు గురు శుశ్రూషవినాగా అనేకవిద్యలలో నాఱితేఱిన ప్రజ్ఞావిశేషమును సంపాదించుటయేకాక దానినంతటినీ పట్టణవాసులకొఱకు నిర్వ్యాజముగా నుపయోగించిన విద్యా వయోవృద్ధులు. “ప్రినిసిపల్డుమేన్” అనే యింగ్లీషుభాషావాదుల టైటిల్సుకు వీరు ప్రథమోదాహరణం కాఁదగ్గవారు. నరసింహశాస్త్రులు గారు “తప్పించుక తిరుగువాఁడు ధన్యుఁడు సుమతీ" అనే మాదిరివారు. వీరు చాలాభాగం తమతండ్రి శ్రీ సీతారామశాస్త్రులవారి యొద్దనే విద్యాభ్యాస మొనర్చినట్లు వ్రాసుకొని యున్నారు. ఆశ్లోకమునుదహరిస్తాను.

శ్లో. విద్వన్మత్తేభపంచాననబిరుదధరో దక్షిణస్యాం తథైంద్ర్యాం
    భూయష్షట్కృత్వ ఊరీకృత నిగమశిరోరత్న భూషాకలాపః
    శ్రీ సీతారామ విద్వద్గురు చరణసమారాధనావా౽ప్తవిద్యో
    వ్యద్యోతిష్టా౽ష్టదిక్షుస్వయ మతులయశా శ్శిష్టవంశ్యో నృసింహాః|

యీ సీతారామ శాస్త్రులవారి సాహిత్యం మిక్కిలి సుప్రసిద్ధం. వీరు కేవలసాహితీపరులు మాత్రమేకారు. వీరివల్ల ప్రస్థానత్రయశాంతి చేసిన వారెందఱో కలరు. సదరు శాస్త్రులవారి దర్శనం నేను గుంటూరులో చేసివున్నాను. మాటలాడడంలోకూడా యీశాస్త్రుల్లుగారు బహు చమత్కారులు. వీరు వార్ధక్య దశలోకి వచ్చారనే కారణంచేత గుంటూరుకాలేజీ ప్రిన్సిపాలు “వుల్లు దొరగారు రిటైరు కావలసిందని చెప్పడానికి పూర్వరంగ ప్రశ్నగా “శాస్త్రుల్లుగారూ? మీకెన్నియేళ్లు" అని అప్పుడప్పుడు అడుగుతూ వచ్చేవారఁట. దానికి