పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

267


ఆ యీ పద్యం రాయలకు యేదో సందర్భంలో పెద్దన్నగారు యిచ్చిన జవాబు. దీనిలో కవి తనకుఁగల స్వేచ్ఛను వెలువరించాఁడు. శ్రీ విజయనగర సంస్థాన గాయక శిరోమణులలో వొకరైన, కీ.శే. శ్రీ కలిగొట్ల కామరాజుగారిని గూర్చి చిత్రంగా చెప్పుకుంటారు. పల్లవిలో ఈ మహనీయుఁడు అద్వితీయుఁడని చెప్పఁగా వినడం. ఆ యీ గాయక శిరోమణి తనకు తోఁచినప్పుడేగాని ప్రభువు కోరినా పాడే ఆచారం లేదని వినికిడి. శ్రీ పరవస్తు రంగాచార్లయ్యవార్లంగారు, తమ యేర్పాటు ప్రకారమైతేనేగాని విజయనగర సంస్థానంవారి ఆస్థానానికి వెళ్లడానికి వొప్పుకొనేలేదు - ఆ యేర్పాట్లు. 1) సవారీతో కోటద్వారం వఱకూ వెళ్లడం, 2) అక్కడ సవారీ దిగి పాదుకలతో సభవఱకూ వెళ్లడం. 3) అక్కడ పాదుకలు వదలి సభకు వెళ్లి సభలో చిత్రాసనంమీఁద కూర్చోవడం.

ఆ యీ మూఁడింటలోనూ మూఁడవదానికి శ్రీ మహారాజావారు చెప్పిన అడ్డంకి యేమిటంటే? స్వామీ! సభలో మీరు చిత్రాసనం మీఁద కూర్చుండడానికి మాకేమీ అభ్యంతరం లేదుకాని ఆ సందర్భం మా పండితుల కవమానకరంగా వుంటుంది గనుక అంగీకారం కాదన్నారనిన్నీ ఆ పద్ధతిని - మేము రానే రాము అని ఆచార్యులవారు నిరాకరించా రనిన్నీ మాపరమ గురువులు చెప్పఁగా విన్నాను - యెవరోతప్ప మహావిద్వాంసులు గాని మహాకవులుగాని మిథ్యాస్తవాలు చేయరు, ఒక షట్ఛాస్త్రవేత్త మహాపండితునకు, ఒక మహాసంపన్నుఁడు నూటపదహాఱు పెద్దకాసులూ సేలువులూ యిచ్చి సన్మానించాఁడు. ఆ యీ సన్మానం వేఱొక పండితుని ప్రయత్నంమీఁద జరిగింది. ఆ ప్రయత్నించిన పండితుఁడు ఆ గృహని గూర్చి కొంచెం శాఘించవలసిందని హెచ్చరించే టప్పటికి ఆ మహావిద్వాంసుఁడు శ్లాఘించిన వాక్యం యిక్కడ వుదాహరించేది లేదు - తాత్పర్యం వ్రాస్తాను.

మీ యిల్లు యిల్లులాగ లేదు. అనఁగా, యేదో మహారాజు గృహం లాగవుందని శ్లాఘించినట్లయింది. కాని దానిలో నుంచి వ్యంగ్యం తీస్తే ఆగృహస్థు యేకులంవాఁడో ఆ కులాన్ని యీసడించి నట్లయింది. అష్టకష్టాలు లోకంలో ప్రసిద్ధం. అందులో మిథ్యాస్తవం చేరలేదు, కాని చేరతగ్గదే. దానిలో యేకొంచెమో గుణంవుంటే “పరగుణపరమాణూన్ పర్వతీకృత్య" అనేది పెంపుచేసి ప్రసంగించవచ్చును గాన కేవలం నిర్గంధ కుసుమాలని గూర్చి ప్రశంసించడం చాలా కష్టం. ఆ యీ బాధ కవుల కప్పడప్పుడు కలుగుతూ వుంటుంది.