పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“పటచ్చరీభూతా ఖల్వియం కీర్తిపతాకా, నన్విదానీమేవ ద్రష్టవ్యమ్"

రామునివంటి నిషధయోగ్యుఁడే ఆవిధంగా ప్రశ్నించినపుడు యితరులు ప్రశ్నించరను కోవడానికి వీలుంటుందా? మనదేశానికి పేరుతెచ్చిన శ్రీనారాయణదాసుగారు, నాయుఁడుగారు లోనైనవారిలో - నాగభూషణంగారొకరు. సంగీతానికి వుపయోగించక పోయినా యితర గాయకులలో (నారాయణదాసుగారికి వినా) పలువురికిలేని ప్రజ్ఞలు నాగభూషణంగారికి వున్నాయి-

'ఇదం బ్రాహ్మ్య మిదం క్షాత్రం' అనే శ్లోకానికి నాగభూషణం గారు ప్రథమోదాహరణం కావడంలో అత్యుక్తి వుండదు కాని ఆ యితర విద్యలే యీయన్ని అస్మదాదుల తరగతిలోకి ఆకర్షించి - భిక్షాటకులా? అనే శీర్షిక కింద వుదాహరించి కొంత వర్ణించడానికి అవకాశం కలిగించినది. యీయన కవి, ప్లీడరు, సాహితీవేత్త, వేదాంతి, ఛాందసుఁడు. ఆ యీ లక్షణాలలో ప్లీడరీ తప్ప తక్కిన చిహ్నాలు అస్మదాదుల తరగతిలోకే ఆకర్షిస్తాయి. ఆకర్షిస్తే ఆకర్షించనివ్వండి, నాకు ఆ యీ తరగతియందే యెక్కువ ప్రేమ. అందుకే

మ. "పరమాదృష్టము పెట్టి పుట్టినటులేభావించి గర్వింతు, దు
       స్తరమీ హూణశకమ్మునం దితరభాషన్ బొట్టకై నేర్వకే
       సురభాషన్ బఠియించి యక్కతన సంస్తుత్యుండనై మించితిన్
       సిరియున్ సంపద కూడ నీ కరుణచేఁ జేకొంటిఁ గామేశ్వరీ.”

యేదో యీ విధంగా వున్నదానితో సంతృప్తి పడాలిగాని గొంతెమ్మ కోరికలు కోరడం మొదలిడితే “మనోరథానా మతటాః ప్రవాహాః".

భర్తృహరి యేమన్నాఁడు? “మనసిచ పరితృప్తే కో౽ర్థవాన్ కోదరిద్రః" అనలేదా? యీ మనస్సుకు తృప్తంటూ వుందా? తృష్ణకు అంతమంటూ వున్నట్టు తోఁచదు. “తృష్ణా నజీర్ణా, వయమేవ జీర్ణాః"

కవులూ, గాయకులూ ఐశ్వర్యానికి వొక విధమైన నోమే నోఁచినా చిల్లరదుకాణం పెట్టడానికి సంశయించకపోతే గాయకులకు పట్నవాసాలు కొంచెం జీవనాన్ని (శిక్షల ద్వారా) కలిగిస్తాయి. యిప్పుడు పెండ్లికూఁతురుకు కావలసిన క్వాలిఫికేషనులో సంగీతం వొకటి. నిన్నమొన్నటిదాఁకా సంగీతం వుంటే సరిపోయేది. ఇటీవల మఱొకటి చేర్చారు. యింగ్లీషు స్కూలు ఫైనలు దాఁకానేనా వుండాలి. పూర్వం యెవరో కవి “కన్యా పితృత్వం ఖలు నామ కష్టం" అని తన మనోదుఃఖాన్ని వెలువరించాఁడు. అప్పటికింకా యీ చిక్కులు గోచరించనేలేదు. అయితే కొంచెం దూరాలోచన చేసి చూస్తే ఆయీ క్వాలిఫికేషన్సు కల కన్యలకు వివాహంచేసేభారం తల్లిదండ్రుల మీఁద వుందనుకోవచ్చును.