పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

263


కొంత సంఘర్షించడం వుండేది. దాన్ని గురించి వ్రాయవలసివస్తే చాలా పెరుగుతుంది. నేనూ, రామారావుగారూ యీ నాగభూషణంగారిని చాలా తేలికగా చూచేవాళ్లం అనేది భూతార్థం. యిటీవల నాగభూషణంగారు విశిష్టత్వాన్ని గానంలో సంపాదించాక కూడా దానిలో రహస్యాలు మాకేం తెలుస్తాయి

ఉ. "చేరువవాడపల్లి నరసిమ్ముఁడితీరత మోయి బోగమ
     మ్మోరులయాట సుస్తివరిముంగల దేముఁడదెంత యిద్దెలో
     తీరుపయాసగంటి నొకతిత్తిని గుక్కిడఁకూఁదువాని కా
     లూరక మొక్క బుద్దగు నహో! యను మూర్ఖుఁడు చంద్రశేఖరా!"

అన్నట్టుంటుంది మాబోట్ల రసజ్ఞత్వం. ఆయన కొంతసేపు గానకచేరీ చేసి నాదబ్రహ్మముగా మారిపోయి పీఁటదగ్గిఱమాత్రం కమాను ఏకొంచెమో నడిపీ నడపనట్లు నడుపుతూ వుండే వైఖరి నూత్నదంపతులు క్రీడాగృహంలో సల్లాపిస్తూన్నట్లు - అనఁగా?

శ్లో. "కిమపి కిమపి మందంమంద మాసత్తియోగా
     దవిరళిత కపోలం జల్పతోః" (భవభూతి)

అన్నట్టుగా వుండిన్నీ యావత్తు సభకూ వినపడుతుంది. ఆ వినికికి కారణం సభవారు నిస్తరంగసముద్రులుగా మాఱడమైనా కావచ్చును. ఆలా మాఱడాని క్కారణం యేమిటంటే, వేఱే చెప్పనక్కఱలేదు. ఆ సమయంలో యేమాత్రం యెడమచేతి వ్రేలు ప్రమాదానికి గుఱి అయినా - గోవిందా! అని గాయకుఁడు పాతాళ గర్తంలో కూలవలసిందే. ఆ జ్ఞానమంతా యెడమ చేతిదే, పాపం! భగవంతుఁడు ఆ చేతియందే తన తేజాన్ని లోపింపఁ జేశాఁడు. ఆ యీ తన పోకడ కొడుకుల కలవాటు పడక పూర్వమే యీ అపకారం జరిగింది. ఆ అపురూపపు పోకడ (దక్షిణ దేశంలో కాదు) మన తెలుఁగుదేశంలో పోయేవారున్నారో లేదో? ఉంటారే అనుకుందాం, యిది గానంగాని కవిత్వం కాదు. మర్మం విడిచి కొడుక్కు కూడా గాయకులు చెప్పరని కింవదంతి. అట్టి స్థితిలో యెవరు చెపుతారు

శ్లో. “యాతే దివం పితరి తద్వచనైవ సార్థం
     విచ్ఛేదమాప భువి యస్తుకథా ప్రబంధః"

అన్నాఁడు బాణమహాకవికొడుకు ఉత్తరకాదంబరిలో - అక్కడ బాణుఁడు స్వర్గానికి వెళ్లడంచేత ఆ దుర్యోగం పట్టింది. ప్రస్తుతం, నాగభూషణంగారు సజీవులై దీర్ఘాయుష్మంతులై కొంత ఆరోగ్యంలో (ఫిడేలుకు మాత్రం పనికిరానిస్థితి) వుండఁగానే దుర్యోగం పట్టింది. యిప్పడెవరేనా నాగభూషణంగారిని నీకు సంగీతంలో యేమీ రాదని అన్నా వూరుకోవలసిందే. శ్రీరాముఁడేమన్నాఁడు పరశురాముణ్ణి - -