పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వొకటి వుంది. యీ పళ్యాలంటే యేమిటో యిప్పటివారికి తెలియనే తెలియదు. నాకు యిరవై యేళ్లు వచ్చే వఱకున్నూ కవులకు, తోలుబొమ్మలకు, హాస్యగాళ్లకు, యింకా యెక్‌సెట్రాలకు కోమట్ల యిండ్లల్లో జరిగే వివాహాలలో పళ్యాలు (సన్మానాలన్నమాట) కంపల్‌సరీగా యిచ్చే ఆచారం వకటి వుండేది. ఆ యేర్పాటు మన పూర్వ జమీందార్లు యేర్పఱచి ఆయా విద్యలకు పట్టాలిచ్చివున్నారు. అందుచేత యిచ్చితీరవలసిందే కాని యెగ్గొట్టడానికి వీల్లేదు. నేను కూడా వొకటి రెండు పళ్యాలు యెత్తినవాణ్ణే మా వంశం కవితావంశం కావడంచేత ఆ గౌరవం మా ప్రాంతంలో మా వంశస్టులకు (కవిత్వం చేతకాని వాళ్లకు కూడా) వుండేది. యిటీవల కోమట్లు తెలుఁగుమీరి యివ్వడం మానేశారు. పిఠాపుర ప్రాంతం గొల్లప్రోలుగ్రామంలో కోర్డుదాఁకా వెళ్లింది యీ విషయం. దానిలో కోమట్లే గెల్చివుంటారు. పిండిప్రోలు కవిగారు పెళ్లిఅయిన సంవత్సరంలోగా యెప్పుడేనా వెళ్లి వసూలుచేసే వారఁట! సకాలంలో మీరు రాలేదు గనక యిచ్చేదిలేదని వొక కోమటి నిర్భయంగా శతాయించి కూర్చునేటప్పటికి మన కవిగారు - పిండీ ప్రోలూ లేకుండా నీయింట్లో పెండ్లేలా జరిగింది? బాగా ఆలోచించుకో జాగ్రత్త - అని కల్లెఱ్ఱఁజేసేటప్పటికి ఆ వర్తకుఁడు భయపడి కాలదోషశంక వదలుకొని పెండ్లిమామూలు యిచ్చి పంపించినట్టు చెప్పఁగా విన్నాను.

యీయన మాటలు అన్నీ యీలాగే వుంటాయి. యీయనపుట్టుకతోనే ద్యర్థికవి.

(1) కుళ్లుముండా గుడ్డుతుక్కుంటాను, బండముండా రాయియ్యవే.

(2) కమ్మకుమ్మొచ్చి పట్టుకుంది.

(3) మాదిగవల్లి శివరావెక్క డున్నాఁడు నాయనా!

యీవాక్యాలన్నీ యీయనవే. సమస్య-

'ఈశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్.'

అని శిష్టు కృష్ణమూర్తిగారికి తగిలివచ్చేటట్టు వొకసమస్య యిచ్చేటప్పటికి కృష్ణమూర్తిగారికి కోపంవచ్చి -

క. “దాశరథీశబ్దమ్మును
    దాశరథిపరమ్ముఁ జేయుద్వైయర్థికిదు
    ర్ధీశక్తి బిడాలమునకు
    నీశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్"