పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

249కవులు భిక్షాటకులేనా?

కవులు భిక్షాటకులేనా? అని ప్రశ్నిస్తే జవాబు చెప్పడం కష్టం.

“భిక్షాటకులే” అందామా? అప్పుడు కొంత చిక్కు వుంది. కాదు అంటే కొంత చిక్కుంది. కొంతసేపు “భిక్షాటకులే” అని జవాబిచ్చి చూద్దాం. దీనికి కొన్ని ఆధారాలు కనపడుతూ వున్నాయి. “మాంతు భిక్షాటనమ్” అన్నాఁడు కాళిదాసు. భోజరాజును స్తుతిస్తూ చెప్పిన శ్లోకంలో చిట్టచివరది పైవాక్యం. శివుణ్ణి ఆశ్రయించిన గంగ, చంద్రుఁడు, వాసుకి, సర్వజ్ఞత్వం, అధీశ్వరత్వం, భిక్షాటనం వగైరాలలో నిన్ను అధీశ్వరత్వ, సర్వజ్ఞత్వాలు పొందినవనిన్నీ తుట్టతుదనున్న “భిక్షాటనం" నన్ను (కాళిదాసుని) ఆశ్రయించిందనిన్నీ కాళిదాసు స్వయంగా వొప్పుకుంటూ వున్నాఁడు. శ్లోకంలో వున్న తక్కిన అంశాలు మనకు ప్రస్తుతాలు కావు కనక వ్యాఖ్యానంతో పనిలేదు. యెవరేనా ఆశ్రయించి జీవించేవాళ్లు ఆశ్రయపదార్థం అంతరిస్తే నఖముఖాలా చెదిరిపోయి మఱొక ఆశ్రయాన్ని చూచుకోవడం లోకంలో వుంది. కనక ప్రస్తుతం కాళిదాసు ఆ రీతిని చమత్కరించాఁడు. శ్రీనాథుఁడు

“కస్తూరికా భిక్షాదానము సేయరా” అని తెలుంగురాయలను

“సాంపరాయని తెలుంగాధీశ!" అని సంబోధిస్తూ యాచించాఁడు. ఆ కస్తూరి తన భార్యగాని, కోడలుగాని, కూఁతురుగాని ప్రసవిస్తేవుపయోగపఱచడాని కేమో? అంటే అందుకుగాదు యిందుకే అని ఆ పద్యంలోనే వ్యాఖ్యానించాఁడు.

"ద్రాక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
 వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు నవ్వాసనల్

యిక్కడ యీ ప్రభువెవ్వరో కొంత విచారిస్తే బాగుంటుంది.

“రంభ గూడెఁ దెలుంగురాయ రాహుత్తుండు
 కస్తూరికేరాజుఁ బ్రస్తుతింతు”

అనే సీసచరణంలో తుట్టతుది సమయములో స్మరింపఁబడ్డవాఁడీ మహారాజే. యితని తండ్రిపేరుతో వున్న గ్రామం వొకటి, గోదావరిజిల్లా రామచంద్రపురం సమీపంలో వుంది. కొమరగిరి, రాజోలు, వేమవరం, పోలవరం యిత్యాదులన్నీ పూర్వం రాజ్యమేలిన