పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/236

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

240

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మొదటి విషయం గుర్తింపవచ్చును, రెండో విషయం గాయనులనుండి (గాయకుల నుండికాదు) తెలుసుకోవచ్చును. మృచ్ఛకటికలో ఖండితంగా - "ఆడదాని సంస్కృతమున్నూ, మొగాడి గానమున్నూ నచ్చదు” అన్న సిద్ధాంతం తోసివేయఁదగ్గది మాత్రం కాదు. పాండిత్య విశేషాదులు పురుషులయందే వున్నాయెక్కడోగాని స్త్రీ గాత్రమందు వుండే మార్దవం పురుష గాత్రమందు వుండదు. పురుషులు స్వరకల్పన చేసేటప్పుడు యెంతో పారుష్యం కనపడుతుంది కాని కీర్తన రచనకంటూ మొదలు పెడితే దానిలో మాత్రం యే పదకవికీ పారుష్యం దొరలడం లేదనే నా అనుభవం.

“హరా! నిన్ను నే నమ్మినాను గదరా
 కరుణాకర పురహర ||హరా||

 హరా నమ్మినానురా | కరుణఁ జూ
 డరా మ్రొక్కుచుంటిరా || ముదమ్ముతో || హరా||

 వరాలతండ్రి నా మొరాలకింపవు
 నిరాదరణకేమిరా? కారణము ||హరా||

యీకీర్తన విట్టల ప్రకాశంగారిది. యీయన అత్యాశువుగా రచించడమున్నూ, యితరులు వ్రాసికోవడమున్నూ నేను స్వయంగా చూచిందే. ఇందులో పారుష్యాన్ని కలిగించే అక్షరాలు లేశమున్నూ లేవు. (ప్రతాప రుద్రీయాదులలో లాక్షణికులు వ్రాసిన పారుష్యాన్ని బట్టి చూచుకోకూడదు. విశేషించి వత్తక్షరాలు లేకపోవడమే చూచుకోవాలి) యింకో విశేషం. పద్యకవులతోపాటు యతిప్రాసలబాధ వీరికిన్నీవుంది. వుండడమంటే సీసగీతాదులలోవలె యేదో వొకటి వుంటేనే చాలును. చంపకమాలాదులలోవలె రెండూ వుండనక్కరలేదు. యిన్ని అక్షరాలకు యతి పెట్టవలసిందనే నియమం లేదుగాని “యత్రతాళ స్తత్రయతిః” అనే నియమం మాత్రం వుంది. అయితే ఆతాళం యెన్ని అక్షరాల పరిమితి కలదిగా వుంటుందో దాన్ని బట్టి యతి పెడుతూ వుంటారు. యీ పదకవులు కొందఱు కొన్ని గేయాలలో అర్ధావృత్తానికే యతి పెడుతూ వుంటారు. కొన్నింటిలో పూర్ణావృత్తానికి పెట్టడమున్నూ కలదు. క్వాచిత్కంగా నాలుగైదు ఆవృత్తులదాఁకా యతిలేనివిన్నీ కనపడతాయి. దీనికి లోఁగడ వుదాహరించిన - రేపు వత్తువుగాని - అన్నది. వుదాహరణం. మాఱుమూలయతులు వీరెక్కడా వాడరు. వొక్కవర్గయతితోటే వీరి రచన యావత్తూ సాగిపోతుంది. ఏకతరయతి అనఁగా (యే అక్షరానికి ఆ అక్షరమే యతిగా పెట్టేది) విశేషించి వాడతారు. పద్యకవులలాగ సులక్షణసారాదులు చదువవలసిన ఆవశ్యకత్వం కూడా వీరికి కనపడదు. “పద్యం పద్యస్య లక్షణమ్” అన్నట్టే యీ పదకవులు అందఱూ కాకపోయినా