పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/231

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పదకవులు

235


చేయడం అనాదిసిద్ధంగానే కనపడుతూవుంది. అట్టిస్థితిలో మొట్టమొదటనే లయబద్ధంగా రచించిన గేయాల యెడల యిటీవలివారికి అనాదరం యెందుక్కలిగిందో బోధపడడంలేదు. అయితే అక్కడక్కడ వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలుండడాన్ని బట్టి యీసడించారనుకుందామా అంటే; అదిన్నీ తగినంత హేతువుగా కనపడదు. 1) జగమేలే పరమాత్మ, 2) అంతారామమయం! మాదిరి ప్రయోగాలు పద్యకవుల కవిత్వాలలో కూడా కనపడుతూనే వున్నాయి.

చ! ఒకని కవిత్వమం డెనయు నొప్పులుఁదప్పులు నాకవిత్వమం దొకనికిఁ దప్పుపట్టఁ బనియుండదు!!

అని సప్రతిజ్ఞంగా గర్జించిన రామలింగమే కాక అతని కంటె పూర్వ మహాకవులున్నూ పిమ్మటి మహాకవులున్నూ శనగపప్పులాగ వాడికొన్న క్త్వార్ధక సంధిని వ్యాకరణం నిషేధించింది కదా? అంతమాత్రంచేత ఆయా కవిత్వాలయందెవరికేనా యీసడింపు కలిగిందా? అందుచేత అదిన్నీ కారణంగాదు.

ఆ వె. గురువు లఘువుఁజేసి కుదియుంచి కుదియించి
       లఘువు గురువుఁ జేసి లాగిలాగి
       కవితఁ జెప్పినట్టి కవిగులామును బట్టి
       ముక్కుఁ గోయవలయు ద్రొక్కిపట్టి.

అంటూ వొక ఆక్షేపణాన్ని తెల్చే పద్యం యెవరు చెప్పిందోగాని నా బాల్యగురువులలో శ్రీ కానుకుర్తి భుజంగరావు పంతులవారు చదువుతూ వుంటే విని వున్నాను. యీ ఆక్షేపణ గానమనే పేరు చెప్పేటప్పటికల్లా “తాటితో దబ్బనం" లాగు వుండేదేగాని దీన్నిబట్టే యీసడించేటట్టయితే సామవేదానిక్కూడా యీ యీసడింపు వర్తించవలసి వస్తుంది. ఆ వేదం గానం చేసేవారు తీసేదీర్ఘాలు యేగాయకులూ తీయనేతీయరు. కాబట్టి పద కవిత్వాన్ని పద్యకవులు యెందుకు యీసడించవలసి వచ్చిందో అని విచారిస్తే తగినంత హేతువు గోచరించడమే లేదు. తగినంత రసవత్తరమైన రచన పదకవిత్వంలో లేదేమో అనుకుంటే క్షేత్రయ్యకంటే రసవత్తరమైన కవిత్వాన్ని రచించిన పద్యకవులంటూ వున్నారా? ఈయన వెళ్లినన్ని శృంగారప్పోకడలు యే మహాకవి కవిత్వంలోనూ కనపడవు. ఈయనేకాదు యెందఱో రసవత్తరమైన కవులు పదకవిత్వం చెప్పినవారిలో వున్నారు.

“అలిగితే భాగ్య మాయె మరేమి వాఁ ||డలిగితే||
తలిరుబోఁడిరొ! వాని దండింప! గలన వాc ||డలిగితే||