పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

"అల తాళ్లపాక చిన్నన్న రోమములైతె తంబురుదండెకు తంతులౌనె?"

అనే సీసచరణంవల్ల స్పష్టపడుతూవుంది. ఈచరణంలో వున్న- "రోమములు" కీర్తనలే. (తాళ్లపాక చిన్నన్నగారి గేయాలు యెంత మధురంగావున్నా ఆకవికి యిష్టంలేదన్నమాట) ఆయీ చరణం వున్న సీసం చాలా అందంగానే వుంటుందిగాని తక్కినచరణాలు- ఏలేశ్వరోపాధ్యాయుల - భట్టరాచార్యులు “అలరాచబిడ్డ-" అనేవి చాలా ముదురు పాకంలో వుండడంచేత వుదాహరించలేకపోయాను. యీ కవి పేరు తెలియదు. యీ వేణుగోపాల శతకం తప్ప యేపుస్తకం వ్రాశాఁడో అంతకంటే తెలియదు. గాని యితనికి వున్నంత ప్రపంచకజ్ఞానం యెక్కడోగాని సర్వసాధారణంగా యితరకవులకు లేదనేచెప్పవచ్చును. శతకాలలో యితని శతకం అగ్రస్థానాన్ని వహిస్తుంది. ఇతనికి కీర్తనల కవిత్వమే కాదు ద్విపద కూడా రుచించదు. అందుచేతే

“ద్విపదకావ్యంబు ముదిలంజ దిడ్డిగంత"

అంటూ యేకడానికి మొదలు పెట్టాఁడు. (ఆయీ యీసడింపు వున్నప్పటికీ ద్విపదకవులను కవులచరిత్ర స్వీకరించిందిగాని గేయకవులను మాత్రం వెలివేసినట్టు బహిష్కరించింది. ప్రత్యేకించేనా యీ కవులచరిత్ర వ్రాస్తే బాగుంటుంది.) భవతు. అంతమాత్రంచేత జయదేవాదులు ఆమోదించిన పద కవిత్వం మట్టిగొట్టుకు పోవలసిందేనా? కొందఱు శ్లోకాలనూ, పద్యాలనూ కీర్తనలకింద మార్చి ఆనందించడంలో కొంత అర్ధంవుందిగాని లేకపోలేదు. నిన్న మొన్న కీ|| శే|| లయిన అల్లంరాజు పేర్రాజు (కృష్ణగానచటికాభాగవతులుగారు) శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలలో చాలా వాటికి చక్కని మట్లు యేర్పరచి శ్రవణానందంగా పాడడం చాలామంది యెఱిఁగిన విషయమే. అందులోనూ

భైరవి - రూపకం

సజలజలదనీలం, వల్లవీ కేళిలోలం IIసజలII

అనేది పల్లవిచేసి పాడుతూవుంటే దీక్షితులవారి

“చింతయ మాకంద మూలకందం”

అనే కృతిని జ్ఞాపకం తెచ్చేది. కుశలవులు గాయకులు కూడా అనే సంగతి “కుశీలవౌ కుశలవ నామధేయౌ" అనేదానివల్ల స్పష్టమవుతూ వుందని లోఁగడ సూచించే వున్నాను. వాక్యరూపంగానో, ఛందోబద్ధంగానో వున్న వేదాన్ని సామవేదులు గానంతో మిళితం