పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యీ చిన్న పద్యానికి వివరణం వ్రాయవలసివస్తే, గతం గతమైనా వున్న ఆయుర్దాయంచాలదు. సంస్కృతానికి ఘంటాపథా లెన్నో వున్నాయి. తెలుక్కి కేవలం దడియీతే తప్ప గతిలేదు. యెందఱో దీనిలో బొందబడ్డ వారున్నారు. దీనిబండారం యావత్తూ లక్ష్యజ్ఞానాన్ని పురస్కరించుకొని వుంటుంది. ఆ యీ జ్ఞానం నూట నాట యెవరికో గాని వుండదు. గొప్ప గొప్ప లక్షణజ్ఞులందఱూ తుదకి మహాభాష్యకారులు సహా లక్ష్యజ్ఞానానికే గౌరవాన్ని సూచించారు. యెంతసేపూ మీరు లక్ష్యజ్ఞానానికే ప్రయత్నించండి. లక్షణజ్ఞానం యెంత వున్నా చాలును.

"వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణనివారణీయా"

యింకొకటి యెందఱినో తెలుగు కవులను పొరపెడుతూవున్న రహస్యం నేను మీకు సందేశిస్తున్నాను. యిది తెలుగు చెప్పేవారు సంస్కృతం చెప్పడం ఆరంభిస్తే తటస్థపడుతుంది. గణాలు వగైరా తెలుక్కీ గీర్వాణానికీ వొకటే రీతిని వుంటాయి. కాని, వొక్క విషయంలో మాత్రం చాలా భిన్నంగా వుంటుంది. తెలుగుకవి తత్సమ సమాసం నాలుగు చరణాలూ కలిపి రచించినా ఆక్షేపించేవారుండరు (అట జని కాంచె భూమి సురుండంబర... కలాపిజాలమున్. చూ.) గాని సంస్కృతరచనలో ఆ ధోరణి తగిలితే చాలా అపహాస్యాస్పద మవుతుంది. సమాసమే కాదు. సంధికూడా అంతే. సంధికి ఉదాహరణం:

"శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామామ్
 అరవిందసమాన సుందరాస్యా మరవిందాసన సుందరీ ముపాసే.”
 ఆయీ శ్లోకంలో ద్వితీయచరణాంత్యం "రామామ్” అన్న దానికిన్నీ

"అరవిందసమాన" అనే దానికిన్నీ సంధిచేయలేదు. చేస్తేనో శుద్ధతప్పు,

"అర్ధాంతవర్జ మఖిలేష్వపి వృత్తకేషు"

అని వుంది. దీని వత్తరార్ధం నా కిప్పటికిరాదు. నాకు చెప్పినవారికి వచ్చివుంటుంది.

నేను చదువుకోడానికి కాశీ వెళ్లివచ్చిన కొత్తఱికంలో (అహమేవ పండితః) వొక అష్టావధాన సభలో ప్రసక్తాను ప్రసక్తంగా అంతకు కొద్ది మాసాలనాఁడు పోటాపోటీగా గణేశ్వరునిమీఁద ఆరభటీవృత్తిలో రచించిన శార్దూలవిక్రీడితశ్లోకాలు నాల్గు చరణాలకూ సమాసం కల్పినవి చదివేటప్పటికి సంప్రదాయజ్ఞులైన వొకానొక వృద్దులు "నాయనా, ఆసమాసం సంప్రదాయం యెఱిఁగినవారు అంగీకరించరు" అన్నారు. నేను ఆయన్ని బుకాయించి “అయ్యా! యిది తెలుఁగనుకున్నారేమో? సంస్కృతం. మీకు విషయం కాదు."