పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222



కవుల కష్టసుఖములు

నాయెఱిఁగిన కష్టసుఖాలనుగూర్చి శిష్యప్రశిష్యులకూ, ఏకలవ్యశిష్యులకూ కొంచెం వ్యాఖ్యానించడం చాలా ఆవశ్యకమంటూ ఆంధ్రపత్రికాధిపతి తఱచు హెచ్చరిస్తూ వుంటారు. ఆయన యీ విధంగా నన్ను ప్రోత్సహించడానికి కారణం నావార్ధక్యమే. అయితే యేకొంచెమో మిగిలి వున్నాయేమో కాని తక్కినవి అక్కడక్కడ చాలాభాగం వ్యాకరించే వున్నాను.

రచన అనేది సుబోధంగా వుండా లనునది ముందు జనించి పిమ్మట నా జననమని నన్ను మన్నించువారు సంభావింతురుగాక. యేమంటే కవిత్వమనేది తన మనస్సులో వుండే అభిప్రాయాన్ని యితరులకు తెలుపుడు చేయడానికి పుట్టింది కాబట్టిన్నీ ఆ యితరులలో భాషాపాండిత్యం యెక్కువగా వున్నవారే కాక, తక్కువగా వున్నవారూ వుంటారు కనుకనున్నూ యీ అభిప్రాయం పండితులలో చాలామందికి రుచించదు.

“ఉద్దామద్యుమణిద్యుతి వ్యతికర ప్రక్రీడదర్కోపల
 జ్వాలాజాలజటాల జాఙ్గలతటీ నిష్కూజకోయష్టయః"

యీశైలి వారి నోటికి రుచించినట్లు

“శైశవే౽భ్యస్తవిద్యానామ్"
“రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం
 అయోధ్యా మటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం."

ఆయీ శైలి రుచించదు. బాల్యంలో నేనుకూడా ఆ త్రోవలోనే సంచరించానుగాని యౌవన మంకురించు రోజులలోనే నా రచనకు వార్ధక్యం ప్రారంభమై దానికి సూచకంగా,

తే.గీ. తనకు నాల్గునిఘంటు పదములు వచ్చు
       ననుచుఁ బదిమందికిని దెలియంగ మాఱు
       మూలపదములు గుప్పిన ముచ్చటగునె?
       ప్రతిపదమ్మున రస ముట్టిపడినగాక."