పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మనోమంథానభూతేన” ఇది వుపనిషత్పాఠం. దేవీభాగవతంలోనో? “సతతం మంథయితవ్యం మనసా మంథానభూతేన" అని వుంది. యింకా మఱికొన్ని యీలాటివి వున్నాయి. శ్రుతులను అనువదించే విషయంలో యత్కించిద్భేదంగానో, యథామాతృకం గానో అనువదించడం గత్యంతరాభావాత్ ఆక్షేపణీయంకాదు గాని కల్పనలు మాత్రం వొక కవిని మఱొకకవి అనువదిస్తే గ్రంథచోరుఁడు కాకపోఁడు. శ్రీనాథుని పద్యాలమాదిరిని పెద్దన్నగారి పద్యాలనడక వుండడంగాని, తిక్కన్నగారి పద్యాలమాదిరిని శ్రీనాథుని పద్యాలనడక వుండడంగాని ఆక్షేపణీయం కాదు. ఆలా అయ్యేపక్షంలో యెవఁడూ కవిత్వానికంటూ కలం చేతపట్టడానికే వీలు పడదు. ఆయినా తాత్పర్యం మనస్సులో పెట్టుకునియ్యేవే వొకమహాకవి - చ. "హృదయగతిన్ బురాతన కవీశ్వరు లేగని త్రోవ లేదు నే - తదనుగతిన్ రచించు కృతితాత్వికులన్ గరగింపకుండునే! మదగజరాజయాన మదమంథర బంధురయాన మానముల్" అని సమాధానం చెప్పాఁడు. కవిత్వం పుట్టింది మొదలు యిప్పటిదాఁకా ప్రస్తుతవిషయంలో యింత చక్కని సమాధానం యెవ్వరూ చెప్పలేదు. కేవలపట్టపగటి దొంగతనాలు కనcబడుతూనే వుంటాయి. అవే ఆక్షేపణీయాలు గాని, యేమాత్రమో పోలిక వన్నంత మాత్రంచేత ఆక్షేపణీయంకాదు. యేదేనా అలంకారం వచ్చేటట్టు యేకవేనా యేపద్యమోవ్రాస్తే, ఆ పోలిక యితర కవుల కవిత్వంలో అలా వుండఁగా అలంకార శాస్త్ర (ప్రతాపరుద్రీయాదులలో) గ్రంథాలలోనేనా వుండక తప్పదుగదా? ఆ పక్షంలో అదిమాత్రం గ్రంథచౌర్యంకిందకి రాదా! అందుచేత కవులమీఁద యీ దొంగతనాన్ని ఆపాదించేవారు చాలా పరిశీలించిగాని ఆపాదించకూడదు. నన్నయగారు "నిండుమనంబు" అనేమాట వాడివున్నారు. తిక్కన్నగారున్నూ వాడివున్నారు యీశబ్దాన్ని అంతలోనే గ్రంథచౌర్యాన్ని ఆపాదించడమా? యింతేకాదు యెఱ్ఱన్నగారు వొకచోట

'నీ యింద్రియజయము కీర్తనీయముతండ్రీ!'

అని కాఁబోలును వాడివున్నారు. యేకొంచెమో తేడాగా యీవాక్యం నన్నయ రచనలోనున్నూ చూచినట్టు జ్ఞాపకం. యిదికూడా గ్రంథ చౌర్యంగా భావించరాదు. యిదేమేనాకల్పనకి సంబంధించింది కాదుకదా! సామాన్యమైనమాట, ఆయన నోటమ్మటారావచ్చు యీయన నోటమ్మటా రావచ్చు. అంతమాత్రంచేత- "గ్రంథచోరులు గాని కవులు గారు” అని గ్రంథచౌర్యాన్ని ఆపాదించడం అవిచారమూలకంగా భావించాలి. బుద్ధి పూర్వకంగా కాకపోయినా, యెవరికి యెవరి కవిత్వమందు విశేషాదరం వుంటుందో