పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నా౽నృషిఃకురుతేకావ్యం"

219


పండితులను యీ విషయం ప్రశ్నిస్తే తేలింది కాదు. అప్పుడు యోగులకు గాని ఇది తెలియదనుకున్నాను. సరే! ఇది విషయాంతరం. అక్షరాక్షరానికీ విడcదీసి వ్యాఖ్యానించే మర్యాద వేదంనుంచి వచ్చిందేకాని, యిటీవలి కవులు కల్పించింది కాదని దీని వల్ల స్పష్టమయింది. (వొకటేమిటి? మన విజ్ఞానం సర్వమూ వేదమూలకమే) కాని, యీ మార్గం కావ్యకవిత్వంలో యెక్కడో తప్ప కవులు ఆమోదించలేదు. భారవి ప్రథమసర్గలో “తవాభిధానాత్” అన్నచోట “తశ్చ వశ్చ” అని తకారవకారాలకి ద్వంద్వ సమాసంచేసి, తార్క్ష్యవాసుకులని (నామైకదేశే నామగ్రహణం) వ్యాఖ్యానించడం అందరూ యెఱిఁగిందే. ఆ వ్యాఖ్యానం కేవలవ్యాఖ్యాత కల్పితమో, గ్రంథకర్త వుద్దేశమో? సహృదయులు గుఱితిస్తారు. కవితా సంప్రదాయంలో ఈలాటి పంథా కూడా వకటి వున్నప్పటికీ కవుల ప్రవర్తనంవల్ల దీనికి వైరళ్యం స్పష్టపడుతూ వుంది. కనక, ఇది ఋషులు సూచించినదే అయినా, కవులకు ఆదరణీయం కాకపోయిందని మనం తెలుసుకోవాలి. (వె = వెయ్యేళ్లు, ధ = ధనంతో, వ = వర్ధిల్లుము అనేది దీన్నిబట్టి పుట్టిందే) కొన్ని అక్షరాలు చేరి అయిన రామాదిశబ్దాలకే కాక, ప్రతి అక్షరానికీ కూడా అర్థం వుండడం మహాభాష్యకారులే అంగీకరించారు. (అర్థవంతో వర్ణాః యూపస్సూపః కూః) అయితే, ఆయీ భాష్యం ప్రకృతానికి అనుకూలించేదేనా? అంటారేమో, యే కొంచెమో సందర్భిస్తుందేమోగాని (ద్రావిడ ప్రాణాయామంగా అన్నమాట) నేరుగా సంబంధించదని యెఱుఁగుదును. వొక్క అక్షరాన్ని తీసి దాని స్థానంలో ఇంకో అక్షరాన్ని ఆదేశించినంతలో యెంతో మార్పు కలుగుతుందని తెల్పడానికే యీభాష్యం పుట్టింది. ఆ పక్షంలో అట్టి విలక్షణశక్తి యేకైకాక్షరమందు వుండితీరాలి కదా అని నేను ఆ భాష్యాన్ని వుదాహరించాను. భాష్యందాఁకా యెందుకు? ప్రస్తుతాంశానికి నానార్థ రత్నమాల చాలదా? ఆ నిఘంటువులో అకారాదులకు యెన్నెన్నో అర్థాలు వ్రాయడానికి ఆధారమేమి? ఋషుల పోకడలే. యెన్ని విధాలఁ జూచినా ఋషులకూ, కవులకూ పరస్పర బాంధవ్యం స్ఫురిస్తూనే వుంటుంది. భావనా శక్తి ఋషులయందు చాలాప్రబలంగా వుంటుంది. అంతో యింతో యీ శక్తి ప్రతీకవియందూ వుంటుంది. ఋషులకు వేదం ఆధారం, కవులకు ఋషులు ఆధారం, అస్మదాదులకు కాళిదాసాదులున్నూ, ఋషులూ కూడా ఆధారం. కొందఱు పద్యాలకి పద్యాలే, చరణాలకిచరణాలే పూర్వ కవులవి తమకవిత్వంలో పెట్టుకుంటారు. కొందఱు కొంచెం తలవిఱుపులతో పెట్టుకుంటారు. యివి రెండూకూడా ఆక్షేపణీయాలే. లోఁగడ అమృతబిందూపనిషత్తునుంచి "ఘృతమివపయసినిగూఢం" అనే శ్లోకంయొక్క పూర్వార్ధాన్ని మాత్రం వుదాహరించాను. వత్తరార్ధం వుదాహరిస్తాను. “సతతం మనసి మథయితవ్యం