పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామెతలు

211

"ఒజ్జల పుచ్చకాయ" అన్నంతలో యేం తెలుస్తుంది? గురువుగారి పుచ్చకాయ అన్నంతవఱకే తెలుస్తుంది. లోగడ చేసిన వ్యాఖ్యానాన్ని అనుసరించి కొందఱికి తెలిసినా యింకా కొంత వివరించాలి. గురువుగారేమో? తినడానికని పుచ్చకాయ తెచ్చుకొని దాచుకున్నారు. ఆ సంగతి శిష్యు లెఱుఁగుదురు. యే యెఱుఁగని కుఱ్ఱలో ఆ పుచ్చకాయ బయటికి తీశారు. అదిచూచి పెద్దలు లేదా యెఱిఁగిన శిష్యులు మందలిస్తున్నారు.

ఒజ్జల పుచ్చకాయరా అది అని; నిషిద్ధవస్తువే అయినా అది గురువు లామోదించడంచేత జాగ్రత్తగా కాపాడాలి, ఆక్షేపించనూ కూడదు వారితోపాటు మనం తినాకూడదు. (యా న్యస్మాకం సుచరితాని. నోయిత రాణీ, చూ) అని దాని తాత్పర్యార్థం. సూరన్నగారు యేదో పురవర్ణనా సందర్భంలో, కల్పనాచమత్కృతి ద్వారా భగవంతుఁడు బొత్తిగా నిషిద్ధమయిన దివాసంభోగాన్ని చేస్తున్నట్టు కల్పించి ఆ యీ ఘట్టంలో దీన్ని వాడినారు. ఈ లోకోక్తికి సంప్రదాయార్థం తెలిస్తేనేగాని ఆ పద్యార్థం తేలదు; ఇదేవిధంగా వక్కొక్క లోకోక్తిని వ్యాఖ్యానించవలసివస్తే గ్రంథం బళ్లతో తోలవలసివస్తుంది. కాగితాల కరువుదినాలలో యే పత్రిక భరిస్తుంది? ఇప్పటికి

(1) కుక్కలూ - జంగమూ

(2) ఒజ్జల పుచ్చకాయ.

అనేవి రెండుమాత్రం పూర్తిగా వ్యాఖ్యానించడం జరిగింది. రెండు మూడు వుదహరించడం జరిగింది - యీ "ఒజ్జల పుచ్చకాయ" సామెత గోదావరి మండలంలో యెవరేనా కళాపూర్ణోదయం ద్వారా యెఱిఁగినవారుంటే వుంటారు (అది లెక్కేమిటి,) గాని సర్వేసర్వత్ర యీ అర్థంలో - “గురువులోరి పొగచుట్ట" అని నిమ్నజాతులవారి సహజభాషలో వాడుకుంటారు - దీనికీ కాస్తవివరణం వ్రాయాలి. ఆ కడప ప్రాంతంలో ఆ పుచ్చకాయ నిషిద్ధం. మా ప్రాంతంలో పుచ్చకాయ అంతగాని కొంతగాని నిషిద్ధంగా వున్నట్లు లేదు గాని - పొగచుట్టమాత్రం (అదేనా యిప్పడుకాదు) బాగా నిషిద్ధం, యేదో సందర్భంలో నేను యేభైయేళ్లకు పూర్వం వ్రాసిన పద్యం జ్ఞాపకంవచ్చింది. వుదాహరిస్తే పొగచుట్ట యేలాటిదో తెలుస్తుంది.

క. “ఇంజరము గాదు, రైల్వే,
    యింజననన్ యోగ్యమగు నదే మనఁజుట్టల్
    పుంజముగఁ గాల్చి పొగచే
    రంజిపం గలుగు ద్విజులరాయిడికలిమిన్"