పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుగా అర్థమవడమే యెంత మంచి కవిత్వమేనా నిఘంటులు దగ్గిఱ పెట్టుకుంటేనేగాని సమన్వయించేది గాకపోతే చట్టన ఆనందాన్ని కలిగించదు. ఆయీ మాటకు కొందఱు పండితులు సమ్మతించరు, వారికి బాగా సంస్కృతపదజటిలంగా వుండటమే కావలసింది. మృదంగాది ధ్వనులవంటివి కవిత్వాలుగా అభియుక్తులుగణింపరు. యిది విషయాంతరం. ఆ యీ సామెతలు. “బేవారసాస్తి" వంటివి. ఒకకవి వాడినంత మాత్రంచేత యింకొక కవిదాన్ని వాడుకోరాదనే నియమంలేదు గాని కొన్ని సామెతలుయే శార్దూలంలోనోతప్ప యితర పద్యాలలో యిముడవు. ఆ పక్షంలోమాత్రం దాని జోలికిఁ పోఁగూడదు. మచ్చుచూపుతాను.

"జ్ఞాతిశ్చే దనలేన కిమ్మనెడి వాచారూఢి సత్యమ్ముగన్"

దీనిని మఱోకవి వాడుకోవడానికి హక్కులేకపోదు గాని, భట్టు మూర్తి శార్దూలంలో పెట్టినట్లే ఆకవిన్నీ శార్దూలంలోనే పెట్టాలి. అది గ్రంథచౌర్యం కాకపోయినా గ్రంథచౌర్యంగా పరిణమిస్తుంది. ఆ యీ సామెతలు కవి నివసించే మండలాన్ని బట్టి వుంటాయని లోఁగడ వ్రాసే వున్నాను. యెంతపాండిత్యంవున్నా ఆ సామెతకు సంప్రదాయార్థం తెలియకపోతే పద్యం యొక్క అర్థం అడ్డుతుంది. వొకటే అర్థమిచ్చేవి దేశ భేదం చేత రెండు మూడు సామెతలు వుంటాయని లోఁగడ సూచించేవున్నాను, మచ్చు చూపుతాను.

"ఒజ్జల పచ్చకాయ గావలయు" అని పింగళి సూరన్నగారు వాడినారు. యీ సామెత కర్నూలు ప్రాంతంలో చంటిపిల్లలకు కూడా అర్థమవుతుంది. గోదావరి మండలంలోఁగానీ, గంజాం విశాఖపట్నం మండలాలలోఁగాని అర్ధం పెద్ద పండితులకే కాదు, కర్నూలు ప్రాంతంలో పుచ్చకాయ వుల్లిపాయిలతో (సకలంజం భక్షయేత్) పాటు నిషిద్ధవస్తువు. దీనితోపాటు సొరకాయా, నీటివంకాయఁ, గోళికాయ (గోరుచిక్కుడు) వగయిరాలునూ నిషిద్ధం. కాని పుచ్చకాయంత నిషిద్ధం మాంసంతప్ప వేఱొకటికాదు. దానిక్కారణం ఆయీ పుచ్చవిత్తనం ఖురాసాని దేశాన్నుంచి తురుష్కులు తెచ్చినట్లు కనఁబడుతుంది. ఆముక్తమాల్యదలో "ఖురాసాని పుచ్చలు వోదున్ని" అనే వాక్యం గలపద్యార్థం బాగా తెలిస్తే యీ పుచ్చకాయల హిస్టరీ బాగా తెలుస్తుంది. కాని ఆపద్యం తెలుగే అయినా కూర్పు యిమిడిక భాషాంతరంలాగు కనపడుతుంది. కడప, కర్నూలు ప్రాంతంలో మాంసాశనులు తప్ప పుచ్చకాయ తినరు. తింటేనో? మాంసం తిన్నట్లే, యింత నిషేధం వున్నా ఆపుచ్చకాయలు అగ్రవర్ణస్థులుకూడా చాటునా మాటునా (మన దేశస్థులు వుల్లివలె) తింటూనే వుంటారు కనకనే యీలోకోక్తి పుట్టింది.