పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వివాదపడ్డట్టున్నూ అపుడు బాణుఁడు - శ్లో. నిశ్శ్వాసో౽పిన నిర్యాతి బాణే హృదయవర్తిని, కిం పునః ప్రకటా౽౽టోపపదబద్ధా సరస్వతీ" అని తన పేరును శ్లేషించి భవభూతిని తిరస్కరించి నట్టున్నూ, దానిమీఁద భవభూతికి కోపంవచ్చి - శ్లో. హఠా దాకృష్టానాం కతిపయపదానాం రచయితా జన స్స్పర్ధాళుశ్చే దహహ! కవినా వశ్యవచసా| భవే దద్యశ్వో వాకిమిహ బహునా పాపిని కలౌ| ఘటానాం నిర్మాతు స్స్త్రిభువనవిధాతు శ్చకలహః" అని భవభూతి బాణుణ్ణి యీసడించినట్టున్నూ వక కథ వుంది. యీ కథలని పట్టిచేస్తే ఆ యీ కవులు యేకకాలికులు కాకపోయినా, వొకవేళ యేకకాలికులే అయితే వొకరికి వొకరు తీసిపోయేవారు కారనే ఫలితార్థం తేలుతుంది. ఆలా తేలడంలో కాళిదాసంటేమాత్రం ఆయీ పెద్ద పెద్ద కవులందఱూ శిరసా వహించేవారే అనిన్నీ కొన్నిటివల్ల తేలుతుంది. ఆంజనేయులు రచించి కారణాంతరంచేత చించి పాఱవేసినబాపతు రామాయణంలో చిలక్కొట్లు దొరకడమున్నూ, వాట్లని దండి భవభూతి కాళిదాసులు వారి వారి కల్పనలతో పూరించడమున్నూ అందులో తారతమ్య నిర్ణయమున్నూ భోజరాజసభలోనే జరిగినట్లు చెప్పుకుంటూ ఆనందించడం నేను బహుధావినివున్నాను. యేకకాలీనులు కానిపక్షంలో కూడా ఆలాటి పూర్తి జరగడానికిన్నీ భోజరాజుకాకపోతే మఱివకరాజేనా ఆ విషయాన్ని గూర్చి తనసభలో చర్చ జరిగించడానికిన్నీ అభ్యంతరం వుండదనిన్నీ, దాన్ని సుప్రసిద్దుఁడుకనక భోజుఁడికి అంటఁగట్టారనిన్నీ మనం సమన్వయించుకోవచ్చునని నేను అనుకుంటాను. బాణుఁడు కాళిదాసురోజుల్లో వున్నాఁడనేకథలు అంతగా లేవుగాని దండిభవభూతులను గూర్చినవి మాత్రం చాలా వున్నాయి. కాళిదాసును గూర్చి అతనితో సమకాలికులేకాక అతనికి పూర్వీకులుగా వుండే ఋషులుకూడా వొప్పుకొన్నట్టే కొన్ని కథలు- “చకారకుక్షిగాcడు" అనే వాక్యానికి సంబంధించినవి వగయిరాలు కనపడతాయి.

"అయి ఖలు విషమః" అనేదాని పూర్తివిషయంలో కాళిదాసు ఆంజనేయుఁడికన్నా విశేషజ్ఞుఁడని తేలుతుంది. మొత్తంమీఁద, కాలమ్మాటదేవుc డెఱుఁగునుగాని కాళిదాసు పేరు చెప్పకొంటూ మన ఖండంలోనేకాదు; యూరపుఖండంలోకూడా ఆనందిస్తూవుండడం అనుభవసిద్ధంగా కనపడుతుంది. విషయభేదంవుంటే వుండనివ్వండిగాని కాళిదాసుకన్న కూడా మిన్నగా ఖండాంతరాల్లో గౌరవింపఁబడేపేరు మళ్లా కవర్గాదిలోనే- "గాంధీ" గారికి కనపడుతుంది. రామకృష్ణాదులనేనా యితరఖండవాసులు యీసడిస్తారేమో కాని పై పేళ్లవారిని మాత్రం యీసడిస్తారని తోcచదు. కల్పనా కథలు యథార్థచరిత్రం వున్న వారి విషయంలోకూడా బయలుదేఱుతూనే వుంటాయి. వాటిని ఆఁపడానికి శక్యంకాదు. యీ బయలుదేఱడాన్ని గూర్చి మఱొకప్పుడు విస్తరిస్తాను, యిప్పుడు దీన్ని ముగిస్తాను.


★ ★ ★