పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192



పుక్కిటి పురాణ కథలు

ఈపుక్కిటి పురాణాలను గుఱించి కొంత వ్రాస్తాను. యివి వినేవాళ్ల కెంతో ఆహ్లాదకరంగానైతే కనపడతాయి గాని వీట్లలో సత్యంమాత్రం సున్నకి సున్న హళ్లికి హళ్లీగా వుంటుంది. కొన్ని మనలో యీలాటి కథలు లేకపోలేదు, గాని అన్నీ ఈలాటివిమాత్రం కావు. తెనాలి రామలింగానికిన్నీ పెద్దన్నగారికిన్నీ భట్టుమూర్తిగారికిన్నీ ముక్కుతిమ్మన్నగారికిన్నీ సంబంధించిన కథ లెన్నో వున్నాయి. ఆ కథలు, వీరంతా వొకటే కాలంలో వున్నారంటేనేకాని నిలిచేటట్టులేదు. యితరాధారాలని పుచ్చుకుని వీరు సమకాలికులే కారంటూ వీరేశలింగం పంతులవారు సిద్ధాంతీకరించి యీ కవిసంఘానికి సంబంధించిన కథ లన్నిటినీ తోసేశారు. వీరేశలింగం గారు పైసిద్దాంతాన్ని బయలుదేఱదీసే దాఁకా పైకథలన్నీ అమల్లోనేవున్నాయి, యిప్పుడున్నూ వున్నట్టే గురజాడ శ్రీరామమూర్తి గారు ఆ కథలన్నిటినీ విశ్వసిస్తూనే కవిజీవితాలు వ్రాసివున్నారు. రాయలకాలపు కవులకు సంబంధించిన గాథలకే కాదు యీ దురవస్థ భోజరాజ కాళిదాసులకు సంబంధించిన గాథలకున్నూ పట్టింది. భోజకాళిదాసులిద్దఱేకాక, దండి భవభూతులే కాక, బాణుఁడు కూడా ఒకటేకాలంవారన్నట్టు యితిహాసాలెన్నోవున్నాయి. ఇటీవల వారి వారి కాలనిర్ణయాలు సప్రమాణంగా ఋజువుచేస్తే ఆ యితిహాసాలన్నీ పుక్కిటిపురాణాలక్రింద తేలిపోయాయి. భవభూతి తన వత్తరరామ చరిత్రాన్ని కొడుకు ద్వారాగా కాళిదాసుగారు వేశ్యాగృహంలో వుండఁగా వినిపింపఁజేసినట్టున్నూ, కాళిదాసుగారు విన్నట్టున్నూ వకకథ చెపుతారు. భవభూతి శుద్ధశ్రోత్రియకుటుంబంలోనివాఁ డన్నట్టు ఉత్తరరామచరిత్ర పీఠికలో - "శ్రోత్రియ పుత్రః" అనే మాటవల్లనే తేలుతుంది. అట్టి శ్రోత్రియపుత్రుఁడు వేశ్యాలోలుఁడైన కాళిదాసుకు తన నాటాకాన్ని వినిపించడానికి వేశ్యాగృహానికి వెళ్లడం యెలాగ? అందుచేత కొడుకును పంపి వినిపింపఁజేశాఁడనిన్నీ అనంతరమందు కాళిదాసు విని యేమన్నాఁడని కొడుకును అడిగితే "యేమీ అనలేదు, ఆహ్లాదంగా ప్రియురాలున్నూ, తానున్నూ విన్నా"రనిన్నీ కొడుకు చెప్పినట్లున్నూ దానిమీఁద భవభూతి "యేమిన్నీ అననేలేదా?” అని అట్టే గుచ్చి గుచ్చి అడిగేటప్పటికి కొడుకు -