పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


మనదేశంలో శ్రీ వీరేశలింగం పంతులుగారు ప్రారంభించినప్పుడు యెందఱో పండితులు అది శాస్త్రవిరుద్ధమని వ్రాసివున్నారు. వారివారిని "మీమీ వాదాలు వుపసంహరించు కోవలసిం"దని ఆ పంతులవారు శాసించినట్టుమాత్రం లేదు. ఆయనకు తోఁచిన వుపపత్తులను ఆయన చూపుతూ వచ్చారు. పండితులకు తోఁచిన అనుపపత్తులను పండితులు వ్రాస్తూ వచ్చారు. పూర్తిగా పంతులవారి వుద్యమం నెగ్గినట్టూ లేదు? పండితులదీ నెగ్గినట్టూలేదు; శాస్త్రమేమో పండితుల కనుకూలంగా వుంది - "మును చచ్చినట్టి మగని తద్దినం బెట్టులు?” అనే మీమాంస తేలక కర్మసిద్ధాంత బద్దులగు పండితులు వూరుకున్నారు గాని దయలేకకాదు - జడ్జీ యెంత దయాశీలుఁడైనా లాప్రకారం వురిశిక్షవేస్తూవున్నాఁడు. మేజస్ట్రేటు యెంత దయాశీలుఁడైనా దగ్గిఱవుండి వురితీయిస్తూ వున్నాఁడు. ఆవురిలో ఆ వ్యక్తిని దగిలించేవాళ్లు యెంత దయావంతులైనా ఆ వృత్తిని అవలంబించి వున్నవాళ్లవడంచేత ఆపనిచేస్తూ వున్నారు. ఆతగిలించేవాళ్ల వంశస్థులు ఆవృత్తియందు వాళ్లకు దోషం వుందని మానుకుంటే యెవరు వద్దనఁగలరు? మానుకున్న తత్క్షణం ఆవుద్యోగానికి యెన్నో దరఖాస్తులు వచ్చి పడతాయి. కనక వేశ్యలందఱూ యితరవృత్తితోపాటు కళలుకూడా వదులుకోవచ్చును. అందుకు నావ్యాసం భంగిస్తుందనుకో నక్కఱలేదు. యిదివఱలో యింత విస్పష్టంగా తెలుసుకోకపోయినా యిప్పుడేనా తెలుసుకోవచ్చు ననుకుంటాను- దేవుఁడు మాత్రం దిక్కు లేనివాఁడై, నోరులేనివాఁడై తన మాన్యాలనుగూర్చి అడగలేకపోయాఁడు. దానితో వట్టిరాయే అని స్పష్టమయింది. ఆ పట్లాన్ని హరిజనులకు లోఁకువ చిక్కింది. నేఁడో రేపో అర్చకులు వుడాయిస్తారు. యిఁక నైవేద్యంకూడా వుండదు. ఆపైని కట్టడాలు కొన్నాళ్లవఱకూ మిగిలితే మిగులుతాయి. లేదా యీలోఁగా అవి యేసంస్థకేనా వుపయోగపఱిచేయెడల వారి వారి ద్రవ్యంతోటి మరమ్మత్తు జరుగుతుంది కనక మఱికొంతకాలంకూడా వుండవచ్చు. దేవతానౌకరీకి యేర్పడ్డ మాన్యాలుపోతే వుపేక్షించడంలో సూత్రప్రాయంగా యింత అర్థం యిమిడివుంది. యిదే యే మహమ్మదీయుల మసీదుకు, సంబంధించిందేనా అయితే వారూరుకోరు. యెంత ఆందోళన చేయాలో అంతా చేస్తారు. సాధించితీరుతారు. లోఁకువసంఘానికి సంబంధించిందవడంచేత దీనిగతి యీలాపట్టింది. సాధించేదీలేదు, అఘోరించేదీ లేదు గాని అయ్యో! యీలాజరిగిందే అని యెవఁడేనా అనుకుంటే అనుకోవడానిక్కూడా వీలులేకుండా ఆమాన్యాలవల్ల లాభంపొందిన సంఘాన్నుంచి యెవరో వక మహావ్యక్తి తారతమ్య జ్ఞానంతో పనిలేకుండా సాహసోక్తులతో శాసించడం వకటి తటస్థిస్తూవుంది. అందుచేత భర్తృహరి చెప్పినట్టు"జీర్ణ మంగే సుభాషితమ్” అని చెప్పి వూరుకోవలసిందే! యింతే యెంత వ్రాసినాయింతే, నావ్యాసంమీఁద ఆకొండివారొకరు వారికి తోఁచినమాటలు వ్రాసివున్నారు. ఆయన మతాన్ని