పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వేశ్యాజాతికి వివాహాలు పనికిరావనే కట్టుఁబాటున్నట్టు లేదు. నా వ్రాఁతవల్లకూడా పూర్వంవున్న అధికారం పోవడంలేదు. యిప్పుడు సంస్కర్తలు వేశ్యాజాతికి కలిగించిన కొత్త లాభమల్లా దేవునిసొత్తు అపహరించడానికి అర్హత తప్ప, తక్కిన స్వాతంత్ర్యమంతా పూర్వపు విజ్ఞులున్నూ యిచ్చే వున్నారని పలుచోట్ల వ్రాసేవున్నాను- వకాయన దేవుఁడికి ధర్మకర్తగావుండి తద్ద్వారాగా మహదైశ్వర్య సంపన్నుఁ డైనాఁడనిన్నీ యెవరేనా దేవస్వాపహారం తప్పిదంకాదా? అని తెగించి మాట్లాడితే యెవఁడికేనా దేవుఁడివ్వవలసిందే, నాకున్నూ దేవుఁడేయిచ్చాఁడు మీకు కడుపుబ్బు యెందుకంటూ జవాబు చెప్పేవాఁడనిన్నీ బందరులో వున్నప్పుడు విన్నట్టు జ్ఞాపకం. ఆ పద్ధతిని దేవస్వాపహారదోషం ప్రతీవ్యక్తికీ తటస్థిస్తుంది. దీన్ని యిలాక్కాకపోయినా యింకోవిధంగా భారతీయవిజ్ఞానులు అంగీకరించే వున్నారు– ఆ కారణం చేతనే శిష్టులందఱూ దేవుఁడికి నివేదించి కానీ భుజించరు. ఆయీపదార్థ మంతా తమకు దేవుఁడిచ్చిందే కనక ఆయనకు సమర్పించకుండా భుజిస్తే స్తేనత్వం అనఁగా చోరత్వం తమకు సంఘటిస్తుందనే తాత్పర్యమే. అలా నివేదించడాని క్కారణం. దేవతా మాన్యాలను హరించడానికి దేవదాసీ సంఘానికి తోడుపడ్డవారెవరూ అలా నివేదించేవారుకారు సరిగదా! అలా నివేదించి భుజించేవారి జ్ఞానాన్ని అభినందించే వారుకూడా కారు. కాఁబట్టి ఆ ద్రవ్యం అనుభవించేటప్పడు ఆ పనికూడా ఆ దేవదాసీ జాతివారు చేయనక్కఱలేదనుకుంటాను. తీగఁదీస్తే డొంక కదులుతుంది. పూర్వాచారాలలోఁ గానీ, నవీనాచారాలలోఁగానీ, యేకట్టుఁబాటులోఁగాని యేలేశానికి అంగీకరించకపోయినా అంతకీ ముప్పు సంభవిస్తుంది. అట్లని ఆకట్టుఁబాట్లన్నీ ఆచరణలో పెట్టడం మాత్రం సంభవిస్తుందా? అదిన్నీ సంభవించదుగాని శక్యమైనంతవఱకు ఆచరణలో పెడుతూ శక్యంకాక చేయలేకపోయిన దాని విషయంలో పశ్చాత్తాపాన్ని పొంది తన్నివృత్తికై భగవన్నామస్మరణ చేయవలసివుంటుందని పూర్వుల ప్రవృత్తి తెలుపుతుంది. "క్షంతవ్యో, మేஉ పరాధశివశివశివభో! భోమహాదేవశంభో?” యిత్యాదులవల్ల పైసందర్భము తేలుతుంది. యివన్నీ ఆనకట్టకు పూర్వం మాటలు. యిప్పుడు యీ మాట్లయందు గౌరవంలేదు. లేకపోయినా వ్రాయడం వ్యర్థం. యిప్పుడల్లా యేదో పత్రిక నిండటానికి మేటరు వ్రాయడమే కావలసింది. తారతమ్య జ్ఞానంతో అవసరంలేదు. యెవరినేమాటేనా సరే వ్రాసి పత్రికకు పంపితే “వారూవారూ చూచుకుంటారు మనకేమి?” అని పత్రికవారు ప్రకటిస్తారు. అందుచేత జంకి పెద్ద పెద్దలు "వయం మౌనవ్రతాలంబినః." అని వూరుకున్నారు. నాకు ఆపెద్దలంతటి పాండిత్యంగానీ, యోగ్యతగానీ లేకున్నప్పటికీ ఆయీ ఆచారవ్యవహారాల విషయంలో వారితోపాటు నేనున్నూ వూరుకొనేవున్నాను. యేదో వ్రాస్తూవుంటే దేవుఁడిమాన్యాలు వృధాకావడం మనస్సుకి తగిలింది. దాన్ని పురస్కరించుకొని