పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

185


యెంతెంత జనాన్ని నాశనంచేసినా జనాభివృద్ధి నామమాత్రావశిష్ట మయిందా? ఆలాగే ఆయాదుర్వృత్తులున్నూ, అని దేశచరిత్రవేత్తలకు తెలియనివిషయం కాదు. అందులోనూ ప్రస్తుతవిషయం మరీ దుర్ఘటం. యిది వొకరి తోడ్పాటక్కఱలేకుండానే వారివారి ఆత్మబలం వల్లనే నెగ్గఁదగ్గది. ఆ వృత్తి యందుండే దుర్నీతిని యెఱిఁగే కొందఱు దానివల్ల వుండే లాభాపేక్షచేత వదలలేకుండా వున్నారుగాని మఱో కారణం చేతకాదు. అందఱికీ దేవాలయనవుకరీలు లేవుకూడాను - లేనివారందఱూ ముందుగా దుర్నీతిని వదిలి సునీతిలోకి వస్తే వున్నవారు ఆఫలాపేక్షను వదులుకొని వెంటనే - “నలుగురితో నారాయణా, కులంతో గోవిందా" గా మాఱడం తటస్థించేది. యిప్పుడు ఆలా జరగలేదు. “ముక్కు కోసుకుంటే దేవుఁడు కనపడతాఁ"డన్నట్టు దేవతామాన్యాల చిక్కుతీర్చడంజరిగింది. యితరం యెంతవరకు కొనసాగిందో మాన్యాలు పోఁగొట్టుకున్న ఆ భగవంతుఁడికే తెలియాలి. యే సంఘమేనా నీతిమీఁద ఆధారపడి సునీతికి రావాలి. ఆలాటినీతిని పాటించేవారు యే సంఘంలోనేనా, యే కాలంలోనేనా కొలఁది మందిమాత్రమే వుంటారు. వారు తమతోపాటుగా మఱికొందఱిని తమ మార్గంలోకి రప్పించుకుందామని యత్నించడం యుక్తమే. దాన్ని నిషేధించడంతప్పు. ముమ్మాటికిన్నీ తప్పు. అట్టితోవ నా వ్యాసంలో లేశమున్నూ లేదు. కొన్ని విద్యలకు యే దుష్కార్యంతోటిన్నీ అవసరంలేదు. గాని కొన్ని విద్యలకు అట్టి చిక్కువున్నది. మృదంగం వగయిరా చర్మకట్టు వాద్యాలకు చర్మాలతో అవసరం. అది స్వయంగా చచ్చిన జంతువుల చర్మంతోకూడా సాధించవచ్చునేమో కాని జపతపాలు చేసుకొనేవారికి కృష్ణాజినం కావలసివస్తే అట్టిది పనికిరాదు. అట్లని యే వేఁటకాఁడితోటి గాని నాకొక చర్మం బలవంతంగా చంపిన జంతువు తాలూకు కావాలని చెప్పనూకూడ దన్నారు. అది యెట్లో వీరి ప్రేరేపణ లేకుండా చంపినది దొరికితే స్వీకరించవలసిం దన్నారు. యిది విషయాంతరం. కొందఱు ఋషులైతే సంగీతాన్నిన్నీ దాన్ని పాడేవారినిన్నీ కూడా పూర్తిగా నిషేధించి వున్నారుగాని నారదాదులు గానాన్ని పూర్తిగా ఆమోదించి వున్నారు. పైఁగా దానివ్యుత్పత్తి సామవేదాన్నుంచి పుట్టినట్టుకూడా ప్రమాణాలు కనపడుతూవున్నాయి. అట్టి సంగీతం పురుషులనోటితో వినడంకన్న స్త్రీల నోటితో వినడమే ఎక్కువ రసవత్తరంగా వుంటుందని కాఁబోలును ఆ నారదాదులు అప్సరసలకు దాన్ని వుపదేశించినట్టు తోస్తుంది. గానంతో పాటు అభినయం. అది నాట్యంతో చేరిందే. యివన్నీ స్త్రీలవల్ల కళగట్టి నట్టు పురుషులవల్ల కళగట్టేవి కాకపోయినాయి. రాజాధిరాజులు ఆయీ విద్యలను మిక్కిలిగా ఆదరించేరోజుల్లో యేదో సంఘాన్నుంచి వారివారి తలిదండ్రుల సమ్మతినిబట్టి కొంత ఫలాపేక్షతో దీనికిఁగా తమతమ కొమార్తలను కొందఱిని వదిలిపెట్టడం తటస్థించింది. వాళ్లకు స్వతంత్రత్వం లేకపోతే ఆయీ