పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పూర్వం వాళ్లు. యిప్పుడో యితరులక్కూడా లేకుండా చేయడానికో అన్నట్టు కొన్ని ప్రయత్నాలు చేస్తూవున్నారు. విడాకులచట్టమంటూ వచ్చినా ఆలాంటి పతివ్రతలు చలించరుగాని, ఆచట్టాన్ని కంఠంముడి పట్టుకొనేలాగ సవరించి- "యేస్త్రీగాని బ్రహ్మచారిణిగా వుండకూడదు. వుంటే శిక్షకు పాత్రురాలవుతుంది." అని శాసించడంకూడా తటస్థిస్తే చేసేదేమిటి ఆలాటి దురన్యాయం వుంటుందా? అనడానికి వీలులేదనుకుందామా ఫ్రెంచిదేశంలో ఆమధ్య అనాదిగా నివసిస్తూవున్న "కన్యస్త్రీలు" ఆ దేశంలో వుండడానికి వల్లకాదన్నారంటూ పత్రికల్లో చదివినట్టు జ్ఞాపకం. యిదంతా విషయాంతరం. ప్రస్తుతం పూర్వాచారపరాయణులకు నిలవనీడ లేకుండా పోయేశాసనాలను భారతీయులే ప్రభుత్వం వారినికోరి చేయిస్తూ వున్నారని తెల్సుకోవడమే ఆయీ సోదెకంతకూ ఫలితం. ఆ శాసనాలు కొన్ని కొందఱిని బాధించినా, కొందఱికి వుపకారాలుగా వున్నాయి. అందులో దేవాలయపు మాన్యాలు అంతరించడానికి పుట్టించిన శాసనం యొవళ్లకీ బాధించినట్టు బాహ్యదృష్టికి కనపడకపోయినా, అంతర్దృష్టిని విచారిస్తే క్రమేణా అది పూర్తిగా దేవాలయాలనే అంతరింపచేస్తుందేమో? అని గోచరింపకపోదు. పంచములను దేవాలయాలలో ప్రవేశపెట్టడం జరిగాక, యింకా వాట్ల సత్తకోసం విచారింపవలసివుండదు. “యిప్పటి సంస్కారంవల్ల వేశ్యలు కులస్త్రీలుగా మాఱడమేకదా! జరిగింది. దానివల్ల కొంత సునీతికే అవకాశం యేర్పడిందిగాని దుర్నీతికి అవకాశం లేశమూ లేదే" అనేవారికి జవాబు చెప్పడంకష్టం. అందుచేతే దేవాలయంమాన్యాలు అంతరించవలసి వచ్చింది. “పాపం! యీ మాన్యాల మూలాన్ని యీ జాతికి యీ దురవస్థ తొలఁగడానికి అవకాశం లేకపోతూవుంది” అని శాసనసభ్యులు కరుణించారు. దేవుఁడు రాయేకనక యెవరికీ వానిబాధ లేకపోయింది. జరగవలసినదేమో జరిగింది. యీ బిల్లు ప్యాసుకాలేదే అనుకుందాం; యిదివఱలోవున్న ప్రకారమే ఆయీ కట్టుఁబాట్లు వున్నాయే అనుకుందాం. అప్పడు మాత్రం వేశ్యావృత్తియందు యిష్టంలేని వనితామణులు తమతమ సంతానానికి వివాహాలుచేసి కులస్త్రీమర్యాదలను సంపాదించడానికి అభ్యంతర మేమేనావుందా? అలా వివాహాలు అనాదిగా జరుగుతూనే వున్నాయి కదా! కులస్త్రీలకన్నా యెంతో మిన్నగా సదాచార సంపత్తితో వారు వర్తిస్తూనే వున్నారుకదా! యిప్పుడు దేవ ద్రోహంతప్ప వచ్చిన విశేష మేమిటని నాప్రశ్న జాతియావత్తున్నూ నిష్కళంక జీవనానికి రావడమే విశేషమని ఆవలివారి ప్రత్యుత్తరం. సర్వేసర్వత్ర వకటేనీతికి కట్టుపడడం అసంభవమని చెప్పవలసివున్నా చెప్పక అందుకుకూడా వప్పుకుంటాను. యే యితర సంఘాన్నుంచో కొందఱు దీనికి ఆలాయపడి తీరుతారనిన్నీ మూలోచ్ఛేదం యెన్నటికీ సంభవించదనిన్నీ నా తలంపు - యెన్నెన్ని గాలివానలు. యెన్నెన్ని కలరాలు, యెన్నెన్ని ప్లేగులు, యెన్నెన్ని యుద్ధాలు వచ్చి