పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

182

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


పుణ్యకాలం గతించి చాలాకాలం అయింది. దానికి అపేక్షించి కులక్రమాగతమైన వృత్తిని వదులుకుంటే విచారించవలసిన రోజులు ఆసన్న మయినాయి.

నావద్ద చదువుకోవడానికి వచ్చిన బ్రాహ్మణ విద్యార్థులలో అనాదిగా పౌరోహిత్యాలు వున్నవాళ్లు కొందఱు ఆపౌరోహిత్యమందు వుండే నైచ్యాన్ని బట్టి దాన్ని యిఁకముందు వదులుకునే లేఁత ఆలోచన చేస్తూ వుండేవారు.

శ్లో “పురీషస్యచ రోషస్య హింసాయా స్తస్కరస్యచ
    ఆద్యక్ష రాణి సంగృహ్య చక్రేధాతా పురోహితమ్."

అంటూ వకశ్లోకం యెవరోమహాకవి చెప్పింది లోకంలో శిష్టపరంపర చదవడం కలదు – ఈశ్లోకార్థం వివరించడంకంటె వివరించకపోవడమే కొంత గంభీరంగా వుంటుందని వదిలేశాను - యింతేకాకుండా -

"పౌరోహిత్యం రజనిచరితం గ్రామణిత్వం నియోగమ్" అంటూ వక శ్లోకంలో యెన్నో వృత్తులను అవలంబిస్తే అంతగా ఆక్షేపణ లేని వాట్లను యెత్తుకొని – “మాభూ దేవం మమ పశుపతే! జన్మజన్మాంతరే౽పి"

అంటూ వకకవి దూషించివున్నాఁడు. కవులకేంపని వుంది? ప్రతీదాన్నిన్నీ అగ్రస్థానానికి యెక్కించాలంటే యెక్కించాగలరు! అధఃపాతాళాని కంటించాలంటే అంటించాగలరు. బిల్హణుఁడు కవులశక్తినిగూర్చి విక్రమాంకదేవచరిత్ర 18వ సర్గలో కాఁబోలును యెత్తుకొని రావణాసురుఁడు దుర్మార్గుఁడనుకోవడానిక్కాని, రాముఁడు సన్మార్గుఁడనుకోవడానిక్కాని కవులయొక్క ఆగ్రహానుగ్రహాలే కారణంగా సమర్ధించి వున్నాఁడు - స్తనశల్యపరీక్ష చేయడానికి వుపక్రమిస్తే జీవనార్థం యేవృత్తినీ అవలంబించడానికి అవకాశం లేకపోవలసి వస్తుంది. తుట్టతుదకు శిలోంఛాది వృత్తులుకూడా విమర్శిస్తే ఆఁగనే ఆఁగవు. యీసందర్భం నేను "మల్లేశ్వర షట్చతి" అనేదానిలో విస్తారంగా విమర్శించి అనేకులు నింద్యవృత్తిగా అభిప్రాయపడ్డ అర్చకత్వాన్ని యితర వృత్తులకన్న యిహపర సాధకమైన వృత్తిగా సమర్ధించివున్నాను. విస్తరభీతిచేత ఆయాపద్యాలు వుదాహరించలేదు. ప్రస్తుత మేమిటంటే? పౌరోహిత్యం వదులు కోవాలనుకున్న ఆయా విద్యార్థులకు నేను వదులుకోవద్దని హితబోధ చేసివున్నాను. ఆయా విద్యార్థులు ఆ పౌరోహిత్యంమీఁదనే యిప్పుడు సుఖ జీవనం చేస్తూ నన్ను తల్చుకుంటూ వున్నారు. యీ రోజుల్లో వేదశాస్త్రాలకు ఆమాత్రం మంచివృత్తి మఱోటి వున్నట్టు నాకు తోఁచదు. యేవ్యామోహంవల్ల బ్రాహ్మణాది వర్గాలవా రందఱూ స్వకులోచితవృత్తులు వదులుకొని వున్నారో ఆ వర్ణాలవారందఱూ