పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

178

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యెందుచేత? సలజ్జాగణికా నష్టా నిర్లజ్జేవ కులాంగనా' అని కట్టుఁబాటులో వుండే వాళ్లవల్ల ప్రదర్శింపవలసిన వెన్నఁటికీ కాకపోవడంచేతనే అందుకోసం స్వేచ్ఛా ప్రచారంగల స్త్రీకోసం అవి పుట్టినట్టయింది - లేదా వాట్లకోసం అట్టి స్త్రీలేనా పుట్టినట్టనుకోవాలి. అట్టి జాతి యిదివరలో అనాదిగా అంటే పురాణాలెప్పుడు పుట్టాయో అప్పటికింకా పూర్వాన్నుంచే వకటి యేర్పాటయింది. ఆ జాతికి యిప్పుడు యితర కారణాలవల్ల ఆ విద్య వదులుకోవాలని అభిప్రాయం ప్రాయికంగా కలిగింది. వదులుకోవడానికి పూర్వకాలంలో అయితే రాజకీయ ప్రతిబంధం వుండవలసివచ్చేదేమో కాని యిప్పుడట్టి ప్రతిబంధం లేశమున్నూలేదు. ఆ వదులుకొనే వారిని సంస్కర్తలతోపాటు నేనుకూడా అభినందించేవాణ్ణే. కాని దేవతోద్దేశకంగా మహా పుణ్యాత్ములైన దాతలు పూర్వం తమకు ప్రసాదించిన మాన్యాలతోకూడా వదులుకోవలసిందంటాను. ఆ మాన్యాలు గత కళంకాన్ని జ్ఞప్తికి తెస్తాయనేనా భయపడడం యుక్తం. మాన్యాలేమో అనుభవించడమా? నౌకరీ వదులుకోవడమా? శాంతం పాపం! యీరీతికి అర్చకులుకూడా వస్తేగతేమిటి? దేవుఁడు రాయేకదా! దేవుఁడికి గతెవ్వరు? పండితులేగదా!

శ్లో, "ఐశ్వర్యమదమత్తో౽సి మాం న జానాసి దుర్మతే!
      పరైః పరిభవే ప్రాప్తే మదధీనా తవ స్థితిః."

అని వేదాంతాచార్యులవారు చెప్పిన శ్లోకార్ధంవల్ల పండితులకున్నూ గుళ్లో వుండే దేవుఁడికిన్నీ వుండే సంబంధం యేలాటిదో తెలుస్తుంది. అయితే యిప్పుడు పండితులకు ధర్మనిర్ణయంలో స్థానంలేదు. యేలాటి పండితులకు? వెనకటి భారతీయశాస్త్ర వాసనతో వున్నవారికి. పాశ్చాత్య విజ్ఞానం కలవారే సర్వధర్మ నిర్ణయానికి నియంతలుగా వుంటూ వున్నారు. వారి వుద్దేశాలకిన్నీ వీరివుద్దేశాలకిన్నీ వుత్తరధ్రువ, దక్షిణధ్రువాల కున్నంతే సంబంధం. మళ్లా విషయం విషయాంతరంలోకి దూఁకుతూ వుంది. దేవతా ద్రోహం తప్పు. అది లేని పద్ధతిని దేవదాసీలు తమ సంస్కారాన్ని నిర్వర్తించుకోవడం యుక్తం. ఒక్కళ్లుకూడా పూర్వవృత్తిలో వుండనక్కఱలేదు. ఆ వృత్తిలో హేయత్వం వున్నమాట సత్యమే! ఆ వృత్తిలోనే కాదు; జీవనార్థంగా లోకులు ఆచరించే అన్నివృత్తులలోనున్నూ అంతో యింతో హేయత్వం వుండే తీరింది. అయినా వారువారు యెందు కాయా వృత్తులు అవలంబిస్తూ వున్నారంటే?- "పొట్టకు పట్టెఁడు కూటికే సుమా!' పూర్వవృత్తులలో కంటేకూడా యిప్పుడు మహాగౌరవమైన వనుకొనే వృత్తులలోనున్నూ దోషాలుమితిమీఱి వున్నాయి. ప్రస్తుతం దేవదాసీలు యేవగించుకుంటూ వున్న వృత్తిలోవున్నంత యేవం కాకపోవచ్చును గాని కొంత యేవమున్నూ యెంతో ఘోరమున్నూ వున్న వృత్తులు మఱికొన్ని