పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

177


ఘనకార్యం చేయవలసివస్తే కొంత స్వార్ధత్యాగం అవసరం కదా! అట్టి సందర్భంలో యీ దేవదాసీలు ఆమాన్యాలను కూడా వదలుకొని వుత్తమశీలాన్ని అలవఱచుకోవడానికి యేల ప్రయత్నించరాదు? ఆ మాన్యాలేమో అనుభవించాలీ? ఆ దేవతా సాన్నిధ్య నవుకరీమాత్రం వదులుకోవాలీ? యిది మాత్రం యుక్తిసహంగావుందా? పోనీయండి యీ నాట్యకళ సంసారి స్త్రీలకుకూడా వుపాదేయమే అయినట్టు యిప్పటి సంస్కర్తలు కొందఱు అభిప్రాయపడుతూవున్నారు. అలాటి వ్యాసంకూడా నిన్న మొన్న వకటి చూచాను. ఆ పద్ధతిని సంసారిణులుగా మాఱి కూడా దేవదాసీలు దేవ ద్రోహం లేకుండా ఆ దాస్యాన్ని నిర్వర్తించుకోవచ్చునే! దేవతాదాస్యం పాపకృత్య మనే తాత్పర్యంతో కాదు గదా యీ “మూమెంటు" ప్రారంభించింది? యెన్నో సందర్భాలు నావ్యాసంలో చర్చించే వున్నాను. మళ్లా యిక్కడ చర్వితచర్వణం చేయనక్కఱలేదు. నాట్యకళ పురుషులు కూడా నేర్చినా స్త్రీవేషం ధరించినప్పుడు తప్ప పురుష స్వరూపంతో దానికంతగా శోభరాదు. పురుషుఁడుగానే వుండిచేసే అభినయ విషయం చాల తక్కువ. సాంబమూర్తి యేస్వరూపంతో నటించినా అది వకరిని సంతోష పెట్టడానికి కాదు. దాన్ని చూచినదల్లావక్క పరశక్తి మాత్రమే. నాట్యకళ వినయ విధేయతలతో సిగ్గు బిడియములతో భయభక్తులతో కొన్ని కట్టుఁబాట్లతో వున్న స్త్రీలవల్ల ప్రదర్శింపఁ దగ్గదని యెవ్వరున్నూ చెప్పరు. యిప్పుడు మాత్రం చెప్పేవారు లేకపోలేదు. వారికి పదివేల నమస్కారాలు. అట్టి స్త్రీలు యేజాతిలోనుండి బయలుదేఱినాసరే, స్వతంత్రంగా వుండcదగ్గవారే కాని అన్యథాగా వుండఁదగ్గవా రెన్నఁటికీకారు. “నస్త్రీస్వాతంత్ర్యమర్హతి" అని వ్రాసిన మనువు మూర్ఖఁడని అనేవారు యిప్పటిసాహసులలో కొందఱున్నా అస్మదాదుదలకు అంతటి సాహసంలేదు. స్త్రీ స్వాతంత్ర్యం గృహమందే తప్ప సభల కెక్కడానికి యేమనిషిన్నీ తుదకు యుక్తాయుక్త పరిశీలనగల యే ప్రాచీనాచార పరాయణుఁడైన మనిషిన్నీ అంగీకరించఁడు. గృహమందుకూడా స్త్రీ స్వాతంత్ర్యం యేవో కొన్ని సందర్భాలయందు మాత్రమే - “స్త్రీపుంవచ్చ ప్రచలతి గృహేతస్య గేహం వినష్టమ్" అన్న కాళిదాసు అప్రాజ్ఞుఁడని పూర్వ సాంప్రదాయవేత్తలు చెప్పలేరు. యిప్పటి సంస్కర్తలు తొక్కేతోవలు దేవుఁడంటూ వకఁడున్నాఁడనే నమ్మికతో తొక్కేవికావు. పాశ్చాత్య బుద్ధిమంతులు ప్రకృతిశాస్త్రం యెంత చదివి వశం చేసుకొని దానివల్ల యెన్ని అద్భుతకార్యాలు లోకానికి కనపఱచి, లోకాన్ని భ్రమింపఁజేసినా అవి అన్నీ క్షణికంగా వుండే యీజీవితకాలానికి సంబంధించినవేకాని కళ్లుమూసుకున్న పిమ్మట పనికి వచ్చేవికావు. స్త్రీకిఁగాని, పురుషునకుఁగాని పరమంటూ వకటివుందనే నమ్మికలేనప్పుడే యథేష్ట సంచారం అర్హమవుతుందిగాని అది వుంటే అర్హం కాదని చెప్పనక్కఱలేదు. విషయం విషయాంతరంలోకి దూఁకుతూ వుంది. చెప్పొచ్చేదేమిటంటే? నాట్యాభినయాలు కుల స్త్రీల కర్ణంగావు.