పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వ్రాస్తూవున్నారు. నేను నాట్యాభినయాలు వినియోగించేవాళ్లకి మాత్రమే కదా! స్వాతంత్ర్యం వుండాలన్నది. అట్టి స్వాతంత్ర్యం యిష్టం లేనివాళ్లు ఆ కళలు వదలుకోరాదా? వదలుకోవడమంటే పూర్తిగా కాదు: మహాసభలలో వినియోగించడం మట్టుకే. యింతకూ ఈ విద్య స్త్రీలమీఁద ఆధారపడి వుండఁదగ్గది కానేకాదనికూడా ఆవిడ అభిప్రాయమేమో? పోనీ తోఁచినమాటలు వ్రాసి వూరుకుంటే బాగుండును; వుల్లికుట్టు మాటలతో దూషించింది. వ్యక్తిగతంగా చేసిన దూషణవల్ల ప్రధాన విషయం గట్టెక్కుతుందా? గాంధీమహాత్ముని మాటకన్నా పాటించతగ్గ మాటంటూ వుంటుందా? ఆయన దేవాలయంలో హరిజనులను ప్రవేశపెట్టాలన్నారు. అందఱూ అంటే పూర్వాచార పరాయణులే అందాం అంగీకరించారా? యిఁక ముందేనా అంగీకరిస్తారా? పైఁగా వ్యభిచారాన్ని రూపుమాపడానికి మేం ప్రయత్నం చేస్తూ ఉంటే యీ శాస్త్రుల్లు దాన్ని వృద్ధిపొందించడానికి దోహదం చేస్తున్నాఁడనిన్నీ వక అపాండవం వేయడానికి ప్రతీవాఁడున్నూ భయపడి తీరవలసిందేకదా? ప్రస్తుత విషయంలో, అందుచేత నోరుమూసుకు వూరుకోవడంకన్నకర్తవ్యం కనపడదు. ఆ వ్యభిచారాన్ని దోహదం చేయడానికి యీయనకేదో స్వార్థం అందులో వుందంటూ వక అపాండవమా? భవతు, దానికిన్నీ వప్పకుందాం, "జగమెఱిఁగిన బ్రాహ్మఁడికి" వచ్చే చిక్కేమిటి? కాటికి కాళ్లుచాచుకొన్న రోజుల్లో ఆ స్వార్థాన్ని పురస్కరించుకొని వ్రాయవలసిన అగత్య మేముంటుందో విచారించవలసిందని బుద్ధిమంతుల నడుగుతాను. "వయసి గతే కః కామవికారః" యీలాటి అపాండవం ఆరోపించినంతమాత్రంలో పూర్వుల అభిప్రాయాల యందు నాకు వున్న నమ్మకాన్ని వదలుకొని నేను నవీనాచారాలకు దాసోహమంటానా? సర్వే సర్వత్ర సద్వృత్తిలో లేక దుర్వృత్తిలోనే వుంచుదామని, లేక యేదేనా వక శాస్త్రీయమైన మతమందు వుంచుదామని యెవరేనా ప్రయత్నించి కృతకృత్యులైనారా? అయితే యిన్ని మతా లెందుకుండవలసి వచ్చింది? బుద్ధుఁడు ప్రాణిహింసను మాన్పవలెనని చేసిన ప్రయత్నంకంటే యెవరే ఘనకార్యాన్ని నిర్వహించడానికి పాటుపడ్డారు? దాని ఫలితం రవ్వంతేనా కనపడుతూ వుందా? చైనా జపాను వగయిరాలన్నీ బుద్ధమతంలో చేరినవే కదా! అతఁడు దేవుఁడులేఁడని చెప్పింది మాత్రం వారందఱూ అమల్లోవుంచి ఆదరిస్తూ వున్నారు. హింస చేయకూడదన్నది అప్పుడే దులిపేసి “సెనగలు తిని చేతులు కడుక్కున్నారు" ప్రస్తుత విషయంకూడా అంతే. అయ్యో ఆజాతివారు నేఁటికి కన్నుతెఱిచి దుర్వృత్తిని వదులుకోవాలనుకుంటూ వుంటే దిక్కుమాలిన దేవస్థానం నౌకరీ మాన్యాలు వచ్చి అడ్డుతగులుతూ వున్నాయని దయతలఁచి ఆ పీడకాస్తా తొలగించారు సమర్డులు, దానితో పూర్వదాతల నెత్తి కొట్టినట్టయింది. తక్కిన విషయాన్ని అడిగేదిక్కేదీ? అడిగితేమాత్రం "యిందులో నీకేదో స్వార్ధంవుం” దంటూ వ్రాయడానికి చేతకాదా? భవతు. యేదేనా