పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలకోసరం దేవదాసీజాతి

171


ఆ దేశీయులు అన్యథాగా కమ్ముదల చేసుకుంటూ వున్నారు– అనాథశరణాలయాలు యెందుకోసం ఆ దేశంలో పుట్టఁబడ్డాయి? వేశ్యాపుత్రులకు తండ్రి యెవఁడో తెలియకపోవచ్చును గానీ తల్లి యెవరో తెలుస్తుందిగదా! ఆ శరణాలయంలో చేర్చఁబడ్డ వాళ్లకు తల్లినిగూర్చి గూడా తెలియదుగదా! ప్రతి జాతికిన్నీ యిట్టి కర్మం తటస్థింప చేయడంకంటె దీనికోసం వకజాతిని నిర్బంధం లేని పద్ధతిని యేర్పాటు చేసుకోవడమున్నూ ఆ జాతికి ప్రధానజీవనం గీతాభినయాల మీఁద జరగడానికి వృత్తులు కల్పించడమున్నూ యుక్తంగా వుందేమో చూడండీ! అయితే యీ వృత్తియం దెంతో తప్పిదం కనపడుతుంది కనక దీన్ని నిర్మూలిస్తేనేకాని వల్లకాదంటారా? అనండి. కసాయివ్యాపారం అంటూ వుందికదా? వెనుకటి రాజులు వగయిరాలు మాంసాన్ని తింటే తిన్నారుకాక, జంతు వధకంటూ శాలలు నిర్మించినట్టు గ్రంథాల్లో కనపడదు- యే అడవిలోనో వేఁటాడి తెచ్చిన మాంసాన్ని అమ్ముకునేవాళ్లు అమ్ముకొనేవారు. కొనుక్కుతినేవాళ్లు తినేవారు. అంతే. భారతంల్లో ధర్మవ్యాధుఁడు చెప్పిన మాటలుకూడా యీ అర్ధాన్నే బోధిస్తాయి. జంతువుల వధ్యస్థానానికిన్నీ వేశ్యాగృహానికిన్నీ చాలా భేదం వుంటుంది. మాంసం తినేవాళ్లంటూ లేకపోతే ఆవృత్తికి వకజాతితో అవసరం వుండేదేకాదు. ప్రస్తుతంకూడా పురుషు లందఱూ నీతిపరులే అయితే వీళ్లుకూడా అవివాహితులుగా వుండికూడా బ్రహ్మచారిణులుగానే వుండేవారేమో? కొందఱి అభిప్రాయం యీజాతి కులస్త్రీల పాతివ్రత్యాన్ని కాపాడడానికి యేర్పడ్డట్టుగా కూడా కనపడుతుంది. యీ అభిప్రాయాన్ని పురస్కరించుకొనియ్యేవే పాండవప్రవాసంలో మేమీ పద్యం వ్రాసింది

చ. “చపలులులేరె? యెందుఁ బెఱచానలె కావలెనే? స్వకాంతలే
     ల పనికిరారు? రా రనుము లంజలులేరె? భవాదృశుల్ నృపా
     లపశువు లంగనాజనములన్ గికురింతు రటంచుఁగాదె? శు
     ద్ధపశుసమానజాతి నొక దానిని ధీవరు లొప్పిరో జడా!"

యీ పద్యం ధర్మరాజు సైంధవుణ్ణి మందలించే ఘట్టంలోది- పైపద్యంలో వేశ్యలు పశుతుల్యలుగా పేర్కోఁబడ్డారు. అందుకు ఆధారం "పశువేశ్యాదిగమనే ప్రాయశ్చిత్తం సమాచరేత్" అనే ధర్మశాస్త్రం. యిప్పుడు లోకంలో స్త్రీలు వాళ్లంతట వాళ్లు యితరదేశాల నాగరికతకు లోcబడి తమతమశీలానికి భంగంతీరి కూర్చుని తెచ్చుకుంటూ వున్నారే కాని ప్రభుత్వంగాని, అందులోవుండే ప్రముఖులుగాని దుర్వినీతిపరత్వానికి లోcబడి బలవంతంగా స్త్రీల శీలాన్ని లేశమున్నూ భంగించడం లేదు - వెనకటికాలం ఆలాటిదికాదు. వకజమీందారున్నాఁడంటే వాఁడికి వాఁడి గ్రామాల్లో వుండే స్త్రీ లందఱున్నూ అవసరమైతే భార్యాత్వానికి అంగీకరించవలసిందే -యీ విషయం యిప్పుడు తగ్గిందేమో కాని నైజాంలో వుండే యెస్టేట్లు కొన్నిటిలో నిన్న మొన్నటి వఱకూ తఱుచుగా అమల్లోనే వుండేది.