పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శూద్రకమహాకవి బాగా వివరించివున్నాఁడు. నాట్యాభి నయాలేమి, గానమేమి అవి స్త్రీలకు జన్మహక్కుగా వొప్పుకోవలసి వుంటుంది. స్త్రీవేషధారులుగా వుండి రంజింపజేసిన పురుషులున్నూ కొందఱు వుంటారు. పురుషవేషాన్ని ధరించి రంజింపఁజేసే స్త్రీలున్నూ కొందఱు వుంటారుకాని, అది సార్వత్రికంగాదు కనక ఆ యీ విషయం అంత గణించతగ్గది కాదు. అందుచేత నృత్తగీతాలకు భగవత్సన్నిధిని గాని యితరత్రా జరిగే శుభ కార్యాల్లోగాని, స్త్రీలే వుండవలసివస్తుంది. ఆ పద్ధతిని స్వతంత్రత్వంతో సంబంధించిన స్త్రీలు, అవివాహితులు తప్ప పనికిరారు- అందుకోసం యీ వేశ్యాజాతి యేర్పడ్డట్టు తోస్తుంది– “సగం చచ్చి సంగీతమూ, అంతాచచ్చి హాస్యమూ" అంటూ వక లోకోక్తి వుంది. అంటే సంగీతానికి లజ్ఞాత్యాగం అవసరం. అట్టి త్యాగం కులస్త్రీధర్మంకాదని వ్రాయనక్కఱలేదు. అభినయానికి బొత్తిగా సిగ్గుంటే పనికిరాదు కాcబట్టి యీ విద్యలో పేరు ప్రతిష్ఠలు సంపాదించడం అనాదిగా కుల స్త్రీలలో లేకపోవలసి వచ్చింది. యెక్కడో ఒకరిద్దఱు స్త్రీలు యుద్ధం కూడా చేసినట్టు చరిత్రజ్ఞులు వ్రాస్తూ వున్నారు. దాన్ని కాదనవలసి వుండదు. అంతమాత్రంచేత స్త్రీలందఱూ మిల్టరీలో చేర్చుకోతగ్గవారే అవుతారా?- "కడవంత గుమ్మడికాయా కత్తిపీఁటకు లోఁకువ" అనే సామెత వినలేదా? యీశ్వరుఁడు బ్రహ్మదేవుణ్ణి మహిషాసురుఁడికి స్త్రీలచేతిలో తప్ప యితరుల చేతులో చావు లేకుండా వర మిచ్చినందుకు యేలా మందలిస్తూ వున్నాఁడో, చూడండీ!

ఉ. "తెచ్చితి వీయనర్ధమును దేవత లందఱకున్, వరంబు ము
      న్నిచ్చి; యిఁ కేమి సేయనగు? నెవ్వరికేనియు వాఁ డవధ్యుఁడౌ
      నచ్చపలున్ వధింపందగు నంగన లెవ్వరు? నీతలోదరిన్
      బుచ్చెదొ? నాతలోదరిని బుత్తునొ? పుత్తుమొ? వాసవాంగనన్."

యీశ్వరుని భార్య మహాకాళి యుద్ధసమర్థురాలే అయినా జనరల్ మీఁద స్త్రీ స్వభావం యుద్ధానికి అనుగుణమయినది కాదు కనుక యీశ్వరుఁడు అలా చెప్పినట్టు విస్పష్టమే. సంసారి స్త్రీలల్లో వేశ్యలతోపాటుగాని అంతకన్నా మిన్నఁగా గాని గానాభినయాలు అభ్యసించతగ్గ వ్యక్తులు కొందఱు వుంటే వుందురుగాక, ఆ స్త్రీలను ఆయా సభలకు పంపి తద్ద్వారా ఆయా భూములను అనుభవించడానికి యే గృహమేధిన్నీ ఆమోదించడం సర్వథా అసంభవం గనక యీవృత్తికై మన పూర్వులు వకజాతిని యేర్పఱిచినట్టు విస్పష్టమే. అవివాహితలైన కారణంచేత ఆ స్త్రీలను కొందఱు పురుషులు ప్రేమించడం వగయిరాలు కలిగినాయి. దానివల్ల కొంత అనర్ధమున్నూ కలిగింది. అంతమాత్రంచేత ఆ జాతి దూష్యమనిన్నీ వ్యభిచారానికే యేర్పడ్డదనిన్నీ భావించి “యితర ఖండాలలో యిట్టి జాతి లేదు; మన ఖండానికే తటస్థించింది యీ లజ్ఞాకరమైన ప్రారబ్ధం" అంటూ మనవారు యేవగించుకోవడం చూస్తే కొంత ఆశ్చర్యంగా వుంటుంది. ఆ దేశంలో వున్న లజ్ఞాకరత్వం