పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

169



కళలకోసరం దేవదాసీజాతి

విత్తమాత్రోపాధికమైన వేశ్యాసమాగమాన్ని కవులు పూర్తిగా యీసడించే వున్నారు. కాని మృచ్ఛకటికలో మాత్రం ఆవిషయాన్ని యెత్తుకొని మిక్కిలి చక్కఁగా రసపోషణ చేసివున్నాఁడు శూద్రకమహాకవి.

అందులోవున్న నాయిక వసంతసేన సంపదను వొక మహారాణీ సంపదగా వర్ణించాఁడు - అట్టి వసంతసేనను కేవల గుణానురక్తనుగా నిరూపించి ఆపెయందే పాతివ్రత్యాన్ని ఆపాదించి వున్నాఁడు కాని అట్టిది స్వీయగానే పరిగణింపఁబడుతుంది గనక వేశ్యాకులంలో పుట్టినంతమాత్రం చేత వేశ్యనుగా ఆపెను పరిగణించకూడదని పలువుర అభిప్రాయం. అనాదిగా మనలో ఈ జాతికి కొంత ప్రాధాన్యం వుంటూనే వుంది బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణజాతికి విహితమైన స్నానసంధ్యాదినియమాలు లేకపోయినా ఆ వ్యక్తిని బ్రాహ్మడుగానే పరిగణించడమున్నూ పై నియమాలు వున్ననూ, అన్యుణ్ణి బ్రాహ్మడుగా పరిగణించకపోవడమున్నూ భారతాదికంవల్ల విస్పష్టమే. ఆలాగే సంసారిగా వుండేవేశ్యను సంసారిగా పరిగణింపక వేశ్యగానే పరిగణించడమని గమనింప వలసివుంటుంది. వేశ్యావృత్తిని నిర్మూలించడానికి మద్యపాన నిర్మూలనోద్యమం కంటే కొంత పూర్వమే సంఘసంస్కర్తలు ప్రారంభించారు. ఆ వృత్తి యెంత వరకు నిర్మూలింప బడిందో కాని ముందుగా దేవాలయాల్లో జరిగే నృత్తాదులు పూర్తిగా రూపుమాశాయి. ఆ నౌకరీ భూములు జిరాయితీలోకి చేర్చి పన్ను గట్టడమువల్ల గవర్నమెంటుకు దానివల్ల కొంత లాభము కలిగింది గాని గవర్నమెంటువారు స్వతహాగా యీ స్వల్పలాభానికి అపేక్షించారని అనుకోవడానికి అవకాశం లేదు. శారదాబిల్లువలెనే యీ బిల్లున్నూమనలో ప్రముఖుల కోరికమీఁదనే గవర్నమెంటు ఆమోదించడం జరిగింది. ప్రతిరోజున్నూ భగవదారాధన చేసుకునేజపితలు తుట్టతుదను- "నృత్తం దర్శయామి, గీతం శ్రావయామి" అనడం సర్వానుభవసిద్ధం. దీన్ని బట్టే మహారాజులు, ఆయా ఆలయాలల్లో నృత్తగీతాది వాద్యాదులకు వృత్తులేర్పఱిచి వున్నారనుట సత్యదూరం కాదు. అయితే యీ నృత్తగీతాలు మొగవాళ్లవల్లఁగాని లేదా సంసారి స్త్రీలవల్లఁగాని యెందుకు భగవత్సన్నిధిలో జరిగించకూడ దంటూ కొందఱనవచ్చును. సంగీతవిద్యలో మహావిద్వాంసు లనిపించుకొనే వాళ్లందఱున్నూ మొగవాళ్లే కాని రంజకత్వంమాత్రం స్త్రీగాత్రమందే కాని పురుష గాత్రమందు అంతగా వుండదు. నాట్యం విషయంలో చెప్పనే అక్కఱలేదు. మృచ్ఛకటికలో యిూ విషయాన్ని