పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచారభేదాలు

167


"కఱవు దరిద్ర మాబ్దికముకల్గె నొకప్పుడు" అన్నట్టు యిప్పటి కఱువుకు సినీమాల పీడకూడా సంప్రాప్తించింది. వొకటేమిటి? గృహస్థుల జీవితం యెన్నివిధాల దుర్భరం కావాలో అన్ని అన్నివిధాలా దుర్భరంగా తయారయింది. కఱువు తగ్గేదాకా సంతాననిరోధం అమల్లో పెట్టినా తరవాత మళ్లా కంటాడుగదా? అలా కనడంలో ఆడపిల్లల్ని కన్నట్టయితే పెళ్లి కొడుక్కి కట్నం పన్ను చెల్లించలేక చస్తాడు.

దానికి కంట్రోలు గవర్నమెంటు పెట్టకపోయినా గృహస్థేపెట్టుకోవాలి. యెవ్వడూ ఆచరణలో పెట్టడంలేదుగాని ఋషులు చక్కనికట్టుబాటు యీ విషయంలో రేషనింగును మించినదాన్ని చేసేవున్నారు. ఆరీతిగా దంపతులు ప్రవర్తిస్తే తప్పక ఆయినా బాధలో చాలావఱకు తగ్గుతుంది. యెన్నో నిషేధాలు ధర్మశాస్త్రోల్లో వున్నాయి. యేంలాభం? ఆచరించేవాళ్లు అగ్రవర్ణాలలోనే కనపడరు. నిమ్నజాతులే కొంతమెరుగు. అంతకంటే కూడా చతుష్పాద జంతువులు మెఱుగు, వాట్లకంటె జ్ఞానానికి మనిషి యెక్కువ అనుకోవడమేకాని, సంతానం కనడంలో వాట్ల ఆచారమే అభినందనీయం. వొక్క రష్యా తప్ప యితర ఖండాలలో లేదా యితర దేశాలలో జనాభా హెచ్చి వొకళ్లు వేఱొకళ్ల దేశాన్ని ఆక్రమించడానికి యత్నించడమూ, తద్ద్వారా రక్తపాతమూ, తన్మూలకంగా క్షామమూ వస్తూన్నట్టు యీ కాలంలో స్పష్టమవుతోంది. కోట్లకొలది జనం చచ్చినప్పుడు, యుద్ధానికి పూర్వం సమృద్ధిగా సరిపోయే పంట యిటీవల మిగలవలసింది, ఆలాకాక తల కిందుగ పరిణమించింది. కొన్ని దేశాలు యుద్ధకారణంగా ఆనకట్టలువగైరా చెడి నీటి వసతులు పాడయి వ్యవసాయానికి లాయకుకాకపోవడంచేత దారిద్ర్యానికి గుఱికావడంవల్ల అక్కడికి మన పదార్థాలు యెగుమతి కావడంచేత మన దేశానికి యీ క్షామబాధ సిద్ధించింది. దీని క్కారణం రైలే, “కుంభకోణేకృతం పాపం కుంభకోణే వినశ్యతి" అన్నట్లు రైలువల్ల వచ్చిన చిక్కు రైలువల్లనూ, స్టీమర్లవల్ల వచ్చిన చిక్కు స్టీమర్లవల్లనూ తీరాలిగాని అన్యథా తీరే వుపాయం కనపడదు. యెందఱు యెన్ని చోట్లకు రాయబారాలుగా వెళ్లినా పదార్థమంటూ వుంటే తప్ప ప్రయోజనం వుండదుగదా! యిప్పడు సమృద్ధిగా వరాలు కురిసినా కరువు వెంటనేపోదు. వచ్చే సంవత్సరం పోవాలి. వొక్క వర్షంతోటే లేదు, యింకా యెన్నో యోగాలు అనుకూలించాలి. యితర దేశాలుకూడా బాగా ఫలించాలి, లేకపోతే మననోటికి మన పంట అందదు. మనషావుకార్లు మన దేశానికి అరిష్ట గ్రహాలుగా పరిణమిస్తారు. యెన్ని విధాల అవయోగాలు వుండాలో అన్నీ సమకూడి వున్నాయి!